
బిఆర్ఎస్ అధినేత, తన తండ్రి కెసిఆర్ తీరుపట్ల ఎంఎల్‌సి కవిత ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ తీరుపై ఆమె నేరుగా కెసిఆర్‌కే ప్రశ్నలు సంధించారు. ఎంఎల్‌సి కవిత పేరుతో మే 2న రాసిన్నట్లు ఓ లేఖ గురువారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. `మై డియర్ డాడీ’ అంటూ వరంగల్‌లో జరిగిన బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో పాజిటివ్, నెగెటివ్ అంశాలను ఆమె అందులో ప్రస్తావించారు.
పహల్గామ్ అమరులకు నివాళి, బిఆర్‌ఎస్ సభతో కేడర్ బలపడటం, పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం వంటివి బాగున్నాయని, అదే సమయంలో ఎస్‌సి వర్గీకరణ, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు, వక్ఫ్ బిల్లు వంటి అంశాలపై మౌనం, బిజెపి పార్టీపై తక్కువగా మాట్లాడటం, ఉర్దూలో మాట్లాడకపోవడం ప్రతికూలంగా మారిందని, బిజెపిపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేదని ఆ లేఖలో ఉన్నది.
అయితే ఈ లేఖ ఎంఎల్‌సి కవిత రాశా రా? లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆమె అమెరికా పర్యటనలో ఉండగా, ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు కవిత అందుబాటులో లేకపోవడం, ఆ లేఖ చేతిరాతతో ఉండటం, కవిత తన సోషల్ మీడియా అధికారిక ఖాతాలో పేర్కొనక పోవడం లేఖలో పలు అనుమానాలకు ఆస్కారం కలిగిస్తుంది.
ఈ ఆరు పేజీల లేఖ గురించి ఇప్పటి వరకు ఆమె గాని, ఆ పార్టీ నాయకులు ఎవ్వరూ గాని నోరు మెదపనే లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కవిత లేఖ ప్రకారం బిజెపితో బిఆర్‌ఎస్ దోస్తీ వ్యవహారాన్ని పరోక్షంగా ఆమె ప్రస్తావించారు. బిఆర్‌ఎస్ నిర్ణయాలు, వ్యవహారాలపై ఆ లేఖలో సూటిగా ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ పార్టీ నాయకులకు అందుబాటులో ఉండటం లేదంటూ ఆమె ఆరోపించారు.
బీజేపీ మీద రెండు నిమిషాలే మాట్లాడారని పేర్కొంటూ ఆ పార్టీపై ఇంకా బలంగా మాట్లాడాల్సిందని కవిత తెలిపారు. భవిష్యత్తులో కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేస్తున్నారని, ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తాను కూడా బీజేపీ వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నానని, అందుకే బీజేపీని మరింత తీవ్రంగా లక్ష్యంగా చేసుకోవాలని ఆమె తన తండ్రికి సూచించినట్లు లేఖలో ఉంది.
కాంగ్రెస్‌పై క్షేత్ర స్థాయిలో నమ్మకం పోయిందన్న కవిత బీజేపీ ప్రత్యామ్న్యాయం అనే ఆలోచనను మన కేడర్ చెబుతోందని ఆమె విస్మయం వ్యక్తం చేశారు.
“ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి సహాయం చేశామనే సందేశం కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లింది. కేసీఆర్ అందుబాటులో ఉండటం లేదని, కొద్దిమందికే అందుబాటులో ఉంటున్నారని జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యే స్థాయి నేతలు బాధపడుతున్నారు. అందరికి అందుబాటులో ఉండేలా ప్రయత్నించండి” అని కవిత తండ్రికి సూచించారు.
“వరంగల్ సభలో ఉద్యమ నేతలకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. 2001 నుంచి మీతో ఉన్నవారికి మాట్లాడే అవకాశం ఇస్తే బావుండేది. పాత ఇన్‌చార్జ్‌లకే బాధ్యతలు ఇవ్వడం కూడా కేడర్‌కు నచ్చలేదు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నవారికి నేరుగా పార్టీ ఆఫీసు నుంచే బీ ఫామ్స్ ఇవ్వాలి. వరంగల్ సభలో ఉర్దూలో మాట్లాడలేదు, వక్ఫ్ బిల్లుపై మాట్లాడలేదు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం అంశాన్ని విస్మరించారు” అని కవిత తన లేఖలో సంచలన అంశాలను ప్రస్తావించారు. వాస్తవానికి కవిత అమెరికాకు వెళ్లడానికి ముందే కేసీఆర్‌కు లేఖ రాసినట్లు కాంగ్రెస్ నేత సామ రామ్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
More Stories
యోగా మానవతను పెంచే సామూహిక పక్రియ.. మోదీ
ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఏకాకిగా ఇరాన్
స్విస్ బ్యాంకుల్లో 18 శాతం తగ్గిన భారతీయుల డిపాజిట్లు