కాళేశ్వరం అవకతవకలపై విచారిస్తున్న కమిషన్ గడువు ఎందుకు ఇన్నిసార్లు పొడిగించారో చెప్పాలని బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ కమిషన్ ఏర్పాటు చేసింది ప్రజల ప్రయోజనార్థమా లేక బ్లాక్ మెయిల్ కోసమా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ పంపిన నోటీసులు తనకు ఇంకా అందలేదని చెబుతూ అందిన తర్వాత పూర్తిగా వివరాలు తెలుసుకుని పార్టీ అనుమతి తీసుకుని స్పందిస్తానని తెలిపారు.
అయితే, తనకు నోటీసులు ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి అభాసుపాలవుతారని హెచ్చరించారు. కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలు, అప్పటి సంగతులన్నీ వివరిస్తానని చెబుతూ తనతో పాటు మంత్రులుగా పని చేసిన వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని గుర్తు చేశారు. తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణరావు, కడియం శ్రీహరికి ఏం జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణరావే ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని తెలిపారు.
అయినా ఈ విచారణలో ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఉన్నత స్థాయి ఇంజినీర్లు కెసిఆర్ ఆదేశాల మేరకే తాము నడుచుకున్నామని, దీనిలో తమ ప్రమేయం లేదని తేల్చి చెప్పిన తర్వాత ఇక తాము చెప్పాల్సింది ఏమి ఉంటుందని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ నోటీసులు చూసిన తర్వాత తాను స్పందిస్తానని తెలిపారు. కేసీఆర్ నిర్ణయాలు ఎలా ఉండేవో బీఆర్‌ఎస్ హయాంలో మంత్రులుగా పని చేసి కాంగ్రెస్ లో ఉన్న వారెవరైనా రేవంత్ రెడ్డికి చెప్పి ఉండాల్సిందని చురకలు వేశారు.
కేసీఆర్ హాయంలో ఓ సారి మంత్రివర్గ ఉపసంఘం వేశారని, దానిలో తాను, తుమ్మల, కడియం, హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నామని పేర్కొన్నారు. తమ మంత్రివర్గ ఉపసంఘం ఉండగానే ఏం జరిగిందో తర్వాత మీడియాకు వివరిస్తానని చెప్పారు. నోటీసులు, కేసులకు భయపడనని, కేసీఆర్ తో వివాదం పెట్టుకోవాలంటే భయపడే రోజుల్లోనే ఆరు నెలలపాటు ఆయనతో నేను ఎలా పోరాటం చేశానో యావత్ తెలంగాణ సమాజం చూసిందని రాజేందర్ గుర్తు చేశారు. నోటీసుల వ్యవహారంపై తాను ఏం చెప్పాలో అన్నీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెపుతానని స్పష్టం చేశారు.
More Stories
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
మంత్రివర్గం అనుమతి లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా
మహేందర్రెడ్డి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్