తెలంగాణ రాజ్‌భవన్‌లో మార్ఫింగ్‌ రచ్చ

తెలంగాణ రాజ్‌భవన్‌లో మార్ఫింగ్‌ రచ్చ
తెలంగాణ రాజ్‌భవన్‌లో హార్డ్‌ డిస్క్‌లు, కీలక పత్రాలు చోరీ అంటూ జరిగిన విస్తృత ప్రచారంతో ఆ చోరీ వెనుక ఉన్న మార్ఫింగ్‌ ఫొటోల రచ్చ బయటపడింది. మార్ఫింగ్‌ ఫొటోలతో తోటి మహిళా ఉద్యోగినిని వేధించి సస్పెండైన రాజ్‌భవన్‌కు చెందిన ఓ ఉద్యోగి చీకటి బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. హెల్మెట్‌ ధరించిన ఓ వ్యక్తి రాజ్‌భవన్‌లోకి దర్జాగా ప్రవేశించి కంప్యూటర్‌ గదిలోని హార్డ్‌ డిస్క్‌లు దొంగలించాడు అనే వార్త మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
దీంతో స్పందించిన పంజాగుట్ట ఏసీపీ ఎస్‌.మోహన్‌ కుమార్‌ ఈ చోరీ వ్యవహారంపై స్పష్టతనిచ్చారు. ఆయన కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ (45) రాజ్‌భవన్‌లో కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేసేవాడు.  శ్రీనివాస్‌ కొద్ది రోజుల క్రితం తోటి మహిళా ఉద్యోగినికి ఆమెకు చెందిన కొన్ని మార్ఫింగ్‌ ఫొటోలు చూపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఆ ఫొటోలు పంపారని, తన కంప్యూటర్‌లో ఇంకా చాలా ఫొటోలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాలని ఆమెను భయపెట్టాడు. 
అయితే, తన ఫొటోలను ఎవరో మార్ఫింగ్‌ చేశారని పేర్కొంటూ సదరు మహిళ మే 10న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఫొటోల వెనుక ఉన్నది శ్రీనివాసే అని తేల్చారు. శ్రీనివా్‌సను మే 12న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ వెంటనే రాజ్‌భవన్‌ అధికారులు శ్రీనివాస్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు. అయితే, రెండ్రోజులకే బెయిల్‌పై విడుదలైన శ్రీనివాస్‌ తాను మార్ఫింగ్‌ చేసిన మహిళ ఫొటోలు, వీడియోలు ఉన్న కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ల చోరీకి సిద్ధమయ్యాడు.
మే 14వ తేదీ రాత్రి రాజ్‌భవన్‌కు వచ్చి భద్రతా సిబ్బందిని మభ్యపెట్టి లోపలికి ప్రవేశించాడు. తలకు హెల్మెట్‌ ధరించి కంప్యూటర్లున్న గదిలోకి వెళ్లి తనకు కావాల్సిన హార్డ్‌డిస్క్‌లను ఎత్తుకెళ్లాడు.  ఈ చోరీపై రాజ్‌భవన్‌ ఐటీ విభాగం మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు చోరీకి పాల్పడింది శ్రీనివాస్‌ అని గుర్తించారు.
మే 15న శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని హార్డ్‌డి్‌స్కలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చోరీ కేసులో అతడిని రిమాండ్‌కు తరలించారు. కాగా, తాను మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు బయటి రాకూడదని శ్రీనివాస్‌ హార్డ్‌డిస్క్‌ల చోరీ చేశాడని, రాజ్‌భవన్‌లో కీలకమైన సమాచారం ఉన్న హార్డ్‌ డిస్క్‌లు, ఫైళ్లు మాయం అవ్వలేదని పోలీసులు వెల్లడించారు.