కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు

కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుకు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు గతంలో బీఆర్​ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకూ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్‌ హయాంలో నీటిపారుదలశాఖ మంత్రిగా హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రిగా ఈటల రాజేందర్‌ పని చేశారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. 
 
కేసీఆర్‌ జూన్‌ 5వ తేదీన, హరీశ్‌రావు జూన్‌ 6వ తేదీన, ఈటల రాజేందర్‌ జూన్‌ 9వ తేదీన విచారణకు హాజరుకావాలని పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో దీంతోపాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై విచారణ జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను నియమించింది.
 
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో 2024 మార్చిలో ఈ కమిషన్‌ ఏర్పాటైంది. ఇప్పటికే ఈ కమిషన్​ నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీకంట్రోల్, పే అండ్‌ ఎకౌంట్స్‌, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులతో పాటు నిర్మాణసంస్థల ప్రతినిధులను సైతం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 7 సార్లు కమిషన్‌ గడువును పొడిగించింది. గత నెలాఖరులో ఒక నెల రోజులు మాత్రమే గడువును పొడిగించింది. దీనిప్రకారం ఈ నెలాఖరుకి కమిషన్‌ గడువు పూర్తికావొస్తోంది.
ఈ నెల 21 లేదా 22వ తేదీన జస్టిస్‌ పీసీ ఘోష్‌ తమ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారనే చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారులను విచారించిన సమయంలో చాలా మంది కేసీఆర్ సమక్షంలోనే నిర్ణయాలు జరిగాయని, ఆయన ఆదేశాల మేరకే పలు నిర్ణయాలను అమలుచేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో అప్పటి నిర్ణయాలపై కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ల అభిప్రాయాలను సైతం తెలుసుకోవాలని కమిషన్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో తాజాగా వీరందరికీ నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరుకావాలని కోరారు.