ఆందాల పోటీల‌కు రూ.300 కోట్లు, పుష్క‌రాల‌కు రూ.35 కోట్లా!

ఆందాల పోటీల‌కు రూ.300 కోట్లు, పుష్క‌రాల‌కు రూ.35 కోట్లా!

స‌ర‌స్వ‌తి పుష్క‌రాల సంద‌ర్బంగా గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి కలయికతో ప్రఖ్యాతిగాంచిన త్రివేణి సంగమంలో కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ సోమవారం పుణ్య‌స్నానం చేశారు. అనంత‌రం ముక్తేశ్వ‌ర ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కారాల స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద పుష్కర పండగకు విడుదల చేసిన రూ. 35 కోట్ల రూపాయలు ఏర్పాట్లకు సరిపోవని విమర్శించారు. 

యూపీ రాష్ట్రంలో కుంభమేళా కు 50 కోట్ల మందికి బీజేపీ ప్రభుత్వం సరిపడ నిధులు విడుదల చేసి ఘనంగా నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పుష్కరాలను కుంభమేళ తరహాలో కోట్లాది మందిని తరలించి ఘనంగా నిర్వహించే వాళ్ళమని చెప్పారు. అందాల పోటీలకు రూ. 300 కోట్లు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్యాత్మికతకు రూ. 35 కోట్లు వెచ్చించడం ఏంటి? అని ప్రశ్నించారు.

పుష్కరాలను ఈ ప్రాంతానికి పరిమితి చేయడం పద్ధతి కాదని బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. వచ్చే పుష్కరాలకు ఎక్కువ బడ్జెట్ విడుదల చేసి ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంతో కాళేశ్వరానికి చెడ్డపేరు వచ్చిందని, పుష్కరాలతోనైన మంచి పేరు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ముక్తీశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం కోట్లు వెచ్చించిన నిధులు విడుదల చేయలేదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన రూ. 200 కోట్ల హామీ నెరవేర్చాలని‌ డిమాండ్ చేశారు.

“సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం విచ్చేసి పుష్కర స్నానం ఆచరించడం చాలా సంతోషంగా ఉంది. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం ఇది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు హాజరై స్నానమాచరించడం ఆనందంగా ఉంది. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని, వారి కష్టాలన్నీ తొలగిపోవాలని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశానికి మరింతగా సేవలు అందించేలా దీవించాలని ఆ స్వామివారిని ప్రార్థించా” అని బండి సంజయ్ తెలిపారు.

“ఏమైనా మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తారు. అన్నీ కేంద్రమే చేస్తే ఇక రాష్ట్రం ప్రభుత్వం ఎందుకు? కేవలం ఒక ఏరియాకే పుష్కరాలను పరిమితం చేయడం సరికాదు” అని హితవు చెప్పారు.