అత్యధిక స్థాయిలో హీట్ రిస్క్ లో 76 శాతం ప్రజలు

అత్యధిక స్థాయిలో హీట్ రిస్క్ లో 76 శాతం ప్రజలు

భారత్‌లోని 57 శాతం జిల్లాల్లో ఉంటున్న67 శాతం ప్రజలకు ప్రస్తుతం అధికం నుంచి అత్యధిక స్థాయిలో హీట్ రిస్క్ ఉందని ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పర్యావరణ అధ్యయన సంస్థ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ)  వెల్లడించింది. దేశ జనాభాలో 76 శాతం మంది, అంటే దేశ జనాభాలో మూడోవంతు మంది ఈ 57 శాతం జిల్లాల్లోనే నివసిస్తున్నారని నివేదిక తెలిపింది. 

అత్యధిక హీట్ రిస్క్ కలిగిన టాప్-10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయని సీఈఈడబ్ల్యూ వెల్లడించింది. తాజా అధ్యయనంలో భాగంగా సీఈఈడబ్ల్యూ పరిశోధకులు 734 జిల్లాల కోసం హీట్ రిస్క్ ఇండెక్స్ను రూపొందించారు. 

1982 నుంచి 2022 వరకు 40 ఏళ్ల వ్యవధిలో ఆయా జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతలకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలు, ఆయా జిల్లాల్లో భూమి వినియోగం, అందుబాటులో ఉన్న జల వనరులు, అడవుల విస్తీర్ణం వంటి అంశాల ప్రాతిపదికన జిల్లాలకు హీట్ రిస్క్ ఇండెక్స్‌ను తయారు చేశారు. ఆయా జిల్లాలకు పొంచి ఉన్న హీట్ రిస్క్‌పై సమగ్ర అంచనాకు రావడానికి అక్కడి జనాభా, భవనాలు, ఆరోగ్యం, సామాజిక – ఆర్థిక కారకాలు, రాత్రి ఉష్ణోగ్రతలు, తేమల సమాచారాన్ని విశ్లేషించారు. 

భారత్‌లో ఏటా ఉక్కపోతతో కూడిన పగటి వేళల సంఖ్య పెరుగుతోందని ఈ నివేదిక తెలిపింది. ఉక్కపోతతో కూడిన రాత్రివేళల సంఖ్య అంతకంటే ఎక్కువ వేగంతో ఏటా పెరుగుతోందని, ఈ మార్పు వల్లే ప్రజల్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని సీఈఈడబ్ల్యూ పేర్కొంది. ‘అర్బన్ హీట్ ఐలాండ్’ ఎఫెక్ట్ వల్ల భారత్‌లోని నగరాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. ప్రత్యేకించి మెట్రో ప్రాంతాల్లో రాత్రివేళ ఉక్కపోత విపరీతంగా ఉంటుంది.

తాము 734 జిల్లాలపై అధ్యయనం చేయగా 417 జిల్లాలు అధిక, అత్యధిక హీట్ రిస్క్ కేటగిరీలలో ఉన్నట్లు తేలిందని సీఈఈడబ్ల్యూ సీనియర్ ప్రోగ్రాం లీడ్ విశ్వాస్ చితాలే తెలిపారు. 417 జిల్లాలకు గానూ 266 జిల్లాలు అత్యధిక హీట్ రిస్క్‌ను, 151 జిల్లాలు అధిక హీట్ రిస్క్‌ను కలిగి ఉన్నాయని చెప్పారు. 201 జిల్లాలు మోస్తరు హీట్ రిస్క్ కేటగిరిలో ఉన్నాయని తెలిపారు. మరో 116 జిల్లాలు అల్ప లేదా అత్యల్ప హీట్ రిస్క్ కేటగిరిలో ఉన్నాయని విశ్వాస్ చితాలే పేర్కొన్నారు. 

“మోస్తరు, అల్ప, అత్యల్ప హీట్ రిస్క్ కలిగిన జిల్లాలకు అస్సలు ముప్పు లేదని భావించడానికి వీల్లేదు. అధిక, అత్యధిక హీట్ రిస్క్ కలిగిన జిల్లాలతో పోలిస్తే వీటికి ముప్పు కొంత తక్కువగా ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది” అని విశ్వాస్ విశ్లేషించారు. సీఈఈడబ్ల్యూ నివేదిక ప్రకారం, అధిక ఉక్కపోత కలిగిన రాత్రుల సంఖ్య భారత్‌లో గత దశాబ్ద కాలంలో వేగంగా పెరిగింది. 

వడగాలులు, అధిక ఉష్ణోగ్రతల వల్ల భారత్‌లోని అల్ప ఆదాయ వర్గాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. వారు తగినంత నీటిని తాగలేకపోతున్నారు. చల్లటి వాతావరణంలో ఉండలేకపోతున్నారు. మండే ఎండల్లో గంటల తరబడి పనిచేసేవారు ఎక్కువ విరామాన్ని తీసుకోవాల్సి వస్తోంది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల 2030 నాటికి భారత్‌లో దాదాపు 3.5 కోట్ల మంది ఫుల్ టైమ్ జాబ్స్ కోల్పోయే ముప్పు ఉందని సీఈఈడబ్ల్యూ నివేదిక తెలిపింది. ఫలితంగా ఆ సమయానికి దేశ జీడీపీ 4.5 శాతం క్షీణిస్తుందని అంచనా వేసింది.