ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులో రైల్వే సూపర్‌యాప్‌

ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులో రైల్వే సూపర్‌యాప్‌
భారతీయ రైల్వే ప్రయాణికులకు అందించే సేవలను మెరుగుపరచడంతో పాటు ఆత్యాధునిక సేవలు అందించేందుకు ఐఆర్‌సీటీసీ సరికొత్తగా ‘స్వరైల్‌‌’ పేరుతో సరికొత్త యాప్‌ని తీసుకువచ్చింది. సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఈ యాప్‌ని అభివృద్ధి చేసింది. ఈ యాప్‌ని రైల్వేశాఖ సూపర్‌ యాప్‌గా పేర్కొంటుంది. అయితే, భారతీయ రైల్వే అందిస్తున్న వివిధ రకాల సేవలు అన్ని ఈ యాప్‌ పరిధిలోకి తీసుకువచ్చింది. 
 
ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌తో పోలిస్తే ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దింది. ప్రస్తుతం ఈ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. అయితే, ఈ యాప్‌ ప్రస్తుతం ఇంకా బీటా వెర్షన్‌లో ఉంది. అయినా ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ అకౌంట్‌తో లాగిన్‌ చేసుకోవచ్చు. కొత్తగా యూజర్‌ అకౌంట్‌ని తీసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా రిజర్వ్‌డ్‌, అన్‌ రిజర్వ్‌డ్‌తో పాటు ప్లాట్‌ఫాం టికెట్లను సైతం తీసుకోవచ్చు. 
 
ప్రయాణికులు యాప్‌లో రైలు ఎక్కబోయే స్టేషన్‌, గమ్యస్థానం, తేదీ, క్లాస్‌ వివరాలన్నీ నమోదు చేసి సెర్చ్‌ చేయాలి. అప్పుడు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ తరహాలో అందుబాటులో ఉన్న రైళ్ల వివరాలు కనిపిస్తాయి. ప్రయాణికుల వివరాలన్నీ ఇచ్చి టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. అయితే, యాప్‌లో కేవలం టికెట్ల బుకింగ్‌కాకుండా అత్యాధునిక ఇంటర్‌ఫేస్‌ కారణంగా యూజర్లు తాము కోరుకున్న సేవలను సులభంగా, వేగంగా మిగతా యాప్స్‌తో పని లేకుండా ఒకే చోట పొందవచ్చు.ఆండ్రాయిడ్ యూజర్లు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ద్వారా లాగిన్ అయ్యే వెసులుబాటు ఉంది. యాప్ హోమ్ స్క్రీన్‌పై రైళ్లను వెతకడం, పీఎన్ఆర్ స్టేటస్, కోచ్‌ ఇన్ఫర్మేషన్‌, రైలు ట్రాకింగ్‌, ఫుడ్‌ ఆర్డర్‌ ఇవ్వడంతో పాటు అధికారుల సహాయం, ఫీడ్‌బ్యాక్‌, టికెట్‌ రీఫండ్‌ తదితర అన్ని ఆప్షన్లు ఒక్క ట్యాప్‌తోనే చేసుకోవచ్చు. కొత్త స్వరైల్‌ యాప్‌ తరుచూ రైలు ప్రయాణాలు చేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి. అలాగే, ఈ యాప్‌లో లార్జ్ షిప్‌మెంట్ సర్వీసెస్ ఫీచర్‌ సైతం ఉంది. ఈ ఫీచర్‌ సహాయంతో రైలులో లగేజీలు పంపేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.