నిధుల విడుదలకు ఐఎంఎఫ్ పాక్‌పై 11 షరతులు

నిధుల విడుదలకు ఐఎంఎఫ్ పాక్‌పై 11 షరతులు
ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్‌కు బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వడంపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు భారత్ నుంచి ఇటీవల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి పాక్ నిధులు మళ్లిస్తోందంటూ ఆరోపణలు గుప్పించింది. ఎట్టకేలకు భారత్ ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న ఐఎంఎఫ్ తాజాగా పాక్‌పై 11 షరతులు విధించింది. 
 
ఇకపై రుణాన్ని విడుదల చేయాలంటే ఈ షరతులకు లోబడి వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేసింది. వీటిలో రూ.17.6 ట్రిలియన్ల పాక్ బడ్జెట్‌కు పార్లమెంటు ఆమోదం పొందటం, విద్యుత్ బిల్లులపై రుణ సేవల సర్‌చార్జి పెంపు, మూడేళ్లకు మించి ఉపయోగించిన కార్ల దిగుమతిపై ఉన్న ఆంక్షలను తొలగించడం వంటివి ఉన్నాయి. తాజాగా విధించిన షరతులతో కలిపి పాక్ రుణాలపై ఐఎంఎఫ్ విధించిన షరతుల సంఖ్య 50కి చేరినట్టు ఐఎంఎంఫ్ తాజాగా విడుదల చేసిన స్టాఫ్ లెవెల్ రిపోర్ట్‌లో పేర్కొంది.
 
పాకిస్తాన్, భారత్ ల మధ్య గత రెండు వారాలుగా నెలకొన్న ఉద్రిక్తతలను ఐఎంఎఫ్ తన నివేదికలో ప్రస్తావించింది.  అయితే ఇంతవరకూ మార్కెట్ ప్రతిస్పందన నియంత్రణలోనే ఉందని, మార్కెట్ లాభాల్లో ఉందని తెలిపింది. “గత రెండు వారాల్లో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. అయితే మార్కెట్ ప్రతిస్పందన ఇప్పటివరకు సాపేక్షంగా నియంత్రణలో ఉంది. స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉంది” అని తెలిపింది. 
 
“వచ్చే ఆర్థిక సంవత్సరానికి పాక్ రక్షణ బడ్జెట్ రూ.2.414 ట్రిలియన్లుగా ఉంది. ఇది గతేడాది పోలిస్తే రూ.252 బిలియన్లు లేదా 12శాతం ఎక్కువ. మే ప్రారంభంలో భారత్ తో ఘర్షణ తర్వాత పాక్ సర్కార్ రూ.2.5 ట్రిలియన్లు లేదా 18 శాతం ఎక్కువ బడ్జెట్‌ కేటాయించనుంది.  ఫెడరల్ బడ్జెట్ రూ.17.6 ట్రిలియన్‌గా ఉంది. ఇందులో రూ.1.07 ట్రిలియన్లు అభివృద్ధి కోసం కేటాయించనున్నారు” అని ఐఎంఎఫ్ నివేదికలో పేర్కొంది.

నాలుగు ప్రావిన్సులు కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలని అమలు చేయాలని, పన్ను రిటర్నింగ్ ప్రాసెసింగ్, పన్ను చెల్లింపుదారుల గుర్తింపు, నమోదు, కమ్యూనికేషన్ క్యాంపెయిన్, సమ్మతిని మెరుగుపరచే వ్యూహాల కోసం కార్యాచరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటివి ఐఎంఎఫ్ షరతుల్లో ఉన్నాయి. ఇందుకోసం ప్రావిన్స్‌లకు ఈ ఏడాది జూన్‌ వరకూ గడువు విధించింది.

”ఐఎంఎఫ్ సూచించిన గవర్నెన్స్ గయోగ్రొస్టిక్ అసెస్‌మెంట్ ఆధారంగా ప్రభుత్వ బలోపాతానికి చేపట్టే కార్యాచరణ పథకాన్ని ప్రభుత్వం రూపొందించాలి. 2027 తర్వాత ఆర్థిక రంగ వ్యూహాన్ని వివరించే ప్రణాళికను సైతం సిద్ధం చేయాలి. ఇంధన రంగంలో నాలుగు కొత్త షరతులు అమలు చేయాలి” అని తెలిపింది. “జూలై 1 నాటికి వార్షిక విద్యుత్ సుంకాల పునర్వవస్థీకరణ నోటిఫికేషన్లు జారీ చేయాలి. అలాగే 2035 కల్లా ప్రత్యేక సాంకేతిక జోన్లు, ఇతర పారిశ్రామిక ప్రాంతాలకు సంబంధించిన అన్ని ప్రోత్సాహకాలు తొలగించేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళికలను ఈ ఏడాది చివరిలోగా సిద్ధం చేయాలి” అని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది.