ఎంపీ మంత్రిపై సిట్ విచార‌ణ‌కు సుప్రీం ఆదేశం

ఎంపీ మంత్రిపై సిట్ విచార‌ణ‌కు సుప్రీం ఆదేశం
ఆప‌రేష‌న్ సింధూర్ గురించి మీడియాతో మాట్లాడుతున్న క‌ల్న‌ల్ సోఫియా ఖురేషిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి విజ‌య్ షాపై సిట్ ద‌ర్యాప్తున‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌తో ప్ర‌త్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు.  ఐజీ ర్యాంక్ ఆఫీస‌ర్ సిట్‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తారు. మంగ‌ళ‌వారం 10 గంట‌ల్లోగా ఆ బృందాన్ని ఏర్పాటు చేయాల‌ని సుప్రీం త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది.
అయితే ముగ్గురు స‌భ్యుల బృందంలో ఓ మ‌హిళా ఎస్పీ ర్యాంక్ అధికారి కూడా ఉండాల‌ని కోర్టు పేర్కొన్న‌ది. మే 28వ తేదీలోగా ఫ‌స్ట్ స్టేట‌స్ రిపోర్టును స‌మ‌ర్పించాల‌ని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ కేసులో మంత్రిని అరెస్టు చేయ‌రాదని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్టే ఇచ్చింది. ఆర్మీ ఆఫీస‌ర్ క‌ల్న‌ల్ సోఫియా ఖురేషిని ఉద్దేశిస్తూ గ‌త వారం మంత్రి విజ‌య్ షా త‌న వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీయ దుమారం సృష్టించారు.
ఉగ్ర‌వాదులు హిందూ సోద‌రుల్ని చంపేశార‌ని, వారి సోద‌రిని ఆర్మీ విమానంలో ఉంచి ఉగ్ర‌వాదుల ఏరివేత‌కు మోదీ పంపార‌ని, ఉగ్ర‌వాద‌లు మ‌న సోద‌రీమ‌ణుల‌ను వితంత‌వులుగా మార్చార‌ని, అందుకే ఆ వ‌ర్గానికి చెందిన సోద‌రిని వారికి గుణ‌పాఠం చెప్పంద‌కు పంపిన‌ట్లు పేర్కొన్నారు.  మంత్రి వ్యాఖ్య‌లు వివాదాస్పదం కావ‌డంతో హైకోర్టు ఆదేశాల ప్ర‌కారం ఆయ‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.  కర్నల్‌ సోఫియా ఖురేషిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ గత వారం మంత్రిని తీవ్రంగా మందలించిన సుప్రీంకోర్టు ఆమెకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.  కోర్టు ఆదేశాలతో ఆయన హైకోర్టులో క్షమాపణలు చెప్పారు. 

అయితే, ఆయన క్షమాపణలు చెప్పిన తీరుపై న్యాయస్థానం తాజాగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ క్షమాపణలను అంగీకరించలేమని తెలిపింది. ‘మీరు ఎలాంటి క్షమాపణ చెప్పారు..?’ అంటూ ప్రశ్నించింది. “మీరు ఎలాంటి క్షమాపణ చెప్పారు..? సారీ చెబుతున్నప్పుడు అందులో కొంత అర్థం ఉండాలి. కొన్నిసార్లు న్యాయ విచారణ నుంచి బయటపడేందుకు కొందరు మర్యాదపూర్వకమైన భాషను ఉపయోగిస్తున్నట్లు నటిస్తారు. మరికొన్నిసార్లు వారు మొసలి కన్నీరు కారుస్తారు. ఇందులో మీ క్షమాపణ ఎలాంటిది..?” అంటూ ప్రశ్నించింది. 

“కోర్టు అడిగింది కదా క్షమాపణ చెబుతున్నా అన్నట్లు ఉంది మీ వ్యవహారం. మీరు చేసిన కఠినమైన వ్యాఖ్యలకు నిజాయితీగా, మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి మీకున్న అభ్యంతరం ఏంటి..?” అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.