
భర్తృహరి మహతాబ్, రవి కిషన్‌తో సహా మొత్తం 17 మంది పార్లమెంట్ సభ్యులకు సంసద్ రత్న అవార్డులు ప్రకటించారు. రెండు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. పార్లమెంట్‌లో చేసిన కృషికి గానూ ఎంపిలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఈ అవార్డులను ఏర్పాటు చేసింది.
వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎన్‌సిబిసి) చైర్మన్ హన్స్‌రాజ్ అహిర్ నేతృత్వంలోని జ్యూరీ కమిటీ అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది. భర్తృహరి మహతాబ్, సుప్రియా సులే (ఎన్‌సిపి-ఎస్‌పి), ఎన్‌కె ప్రేమచంద్రన్ (ఆర్‌ఎస్‌పి), శ్రీరంగ్ అప్ప బర్నే (శివసేన)లను అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నలుగురు ఎంపిలు 16, 17వ లోక్‌సభల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని, ప్రస్తుత పదవీ కాలంలోనూ అదే పనితీరును కొనసాగిస్తున్నారని ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
స్మితా వాగ్ (బిజెపి), అర్వింద్ సవంత్ (శివసేన – యుబిటి), నరేష్ గణపతి మహస్కే (శివసేన), వర్షా గైక్వాడ్ (కాంగ్రెస్), మేధా కులకర్ణి (బిజెపి), ప్రవీణ్ పటేల్ (బిజెపి), రవి కిషన్ (బిజెపి), నిశీకాంత్ దూబే (బిజెపి), విద్యుత్ బరన్ మహతో (బిజెపి), పిపి చౌదరీ (బిజెపి), మదన్ రాథోడ్ (బిజెపి), సిఎన్ అన్నాదురై (డిఎంకె), దిలిప్ సైకియా (బిజెపి) అవార్డు గ్రహీతల్లో ఉన్నారు.
ఆర్థికం, వ్యవసాయంపై రెండు స్టాండింగ్ కమిటీలను కూడా అవార్డుకు ఎంపిక చేశారు. ఆర్థికంపై స్టాండింగ్ కమిటీకి భర్తృహరి మహతాబ్ నేతృత్వం వహిస్తుండగా, వ్యవసాయంపై స్టాండింగ్ కమిటీకి చరణ్‌జిత్ సింగ్ చన్నీ (కాంగ్రెస్) అధ్యక్షత వహిస్తున్నారు.
More Stories
ఐదేళ్లలో వెయ్యి కొత్త రైళ్లు.. 2027 నాటికి బుల్లెట్ రైలు
నకిలీ ఆధార్ కార్డుల తయారీలో బెంగాల్ లో నలుగురు అరెస్ట్
సరిహద్దుల్లో `వాటర్ బాంబు’గా చైనా అతిపెద్ద జల విద్యుత్ డ్యాం