
ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం నమోదవుతుందని మంగళవారం అంచనా వేసింది. మొత్తం సీజన్‌లో ఎల్ నినో పరిస్థితుల అవకాశాన్ని తోసి పుచ్చింది. నాలుగు నెలల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
మొత్తం దీర్ఘకాల సగటు వర్షాపాతం 105శాతంగా ఉంటుందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మోహపాత్ర వెల్లడించారు. దేశంలో 1971-2020 మధ్యకాలంలో దీర్ఘకాల సగటు 87 సెంటీమీటర్లు మాత్రమే ఉండాదని పేర్కొన్నారు. భారత ఉపఖండంలో సాధారణం కంటే తక్కువ వర్షాపాతంతో సంబంధం ఉన్న ఎల్ నినో పరిస్థితులు ఈ సారి అభివృద్ధి చెందే అవకాశం లేదన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్నాటకలోనూ సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని చెప్పింది. వాతావరణ శాఖ ఇచ్చిన అప్‌డేట్ దేశ రైతులకు ఎంతో ఉపశమనం కలిగించనున్నది. నైరుతి రుతుపవనాలు భారత దేశ వ్యవసాయరంగానికి ఎంతో కీలకమైనవి. వ్యవసాయం దేశ జనాభాలో దాదాపు 42.3 శాతం మందికి జీవనోపాధి అందిస్తున్నది. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు 18.2శాతం దోహదపడుతున్నది.
ఇటీవల కాలంలో వర్షం కురిసే రోజులు తగ్గుతుండగా, స్వల్ప వ్యవధిలో భారీ వర్షాలు పెరుగుతోంది. దాంతో తరచూ కరువులు, వరదలు సంభవిస్తున్నాయని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే తీవ్రమైన వేడితో అల్లాడుతున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు గణనీయంగా ఎక్కువ సంఖ్యలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా వైవిధ్యం మరింత పెరిగిందని పేర్కొంటున్నారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
వక్ఫ్ సవాల్ చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరిన కేంద్రం