అయోధ్య గర్భగుడి శిఖరంపై 161 అడుగుల కలశం

అయోధ్య గర్భగుడి శిఖరంపై 161 అడుగుల కలశం
అయోధ్య రామాలయంలోని గర్భగుడి ప్రధాన శిఖరంపై 161 అడుగుల ఎత్తైన కలశాన్ని ప్రతిష్ఠించారు. వేద ఆచార్యులు ఈ మహత్తర కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. దీంతో జన్మస్థల సముదాయంలో నిర్మించిన ఆలయాలలో శబ్ద రుషుల ప్రతిష్ఠ కూడా పూర్తైంది.  ఆలయ సముదాయంలో నిర్మిస్తున్న పరకోటలోని 6 దేవాలయాల పైభాగంలో కూడా కలశాన్ని మరికొద్ది రోజుల్లో ఏర్పాటు చేయనున్నారు. 

అందుకోసం ఆలయ నిర్మాణ కార్మికులు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. బైశాఖి పర్వదినం, డాక్టర్ భీమ్‌ రావ్ అంబేడ్కర్ జయంతి నాటికి శ్రీరాముడి ఆలయ గర్భగుడి శిఖరం పని పూర్తయిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు.  సోమవారం ఉదయం 9.15 గంటలకు కలశ ప్రతిష్ఠ పూజలతో ప్రారంభింభమైందని చెప్పారు. ఉదయం 10.30 గంటలకు శిఖరంపై కలశ ప్రతిష్ఠ పూర్తైందని వెల్లడించారు.

“ఆలయ సముదాయంలోని పరకోట నిర్మిస్తున్న 6 దేవాలయాల పైభాగంలో కూడా కలశాలు ఏర్పాటు చేస్తాం. ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో రామ్‌ లాల్లా కూర్చుని ఉన్నారు. మొదటి అంతస్తులో రామ్ దర్బార్ ఉంది. 6 ఆలయాలలో దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. అంతేకాకుండా సత్య మందిరాలలో విగ్రహాల ప్రతిష్ఠ పూర్తయింది. మిగిలిన శేషావతార్ ఆలయం ఈ ఏడాది పూర్తవుతుంది.” అని చంపత్ రాయ్ తెలిపారు.

రామాలయానికి బెదిరింపులు
కాగా, అయోధ్య రామాలయానికి ఆదివారం రాత్రి బెదిరింపు మెయిల్ రావడం వల్ల కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు భద్రతను మరింత పెంచారు. అయితే, దీనిపై ఆలయ అధికారులు, పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక మెయిల్ ఐడీకి ఆదివారం రాత్రి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.

ఇటీవల అయోధ్య రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చిన రెండో శ్రీరామ నవమి కావడం వల్ల సంబరాలు అంబరాన్నంటాయి. రామయ్య దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై సూర్య తిలకం చూసి భక్తులు తన్మయత్వం చెందారు.