పిల్లల అక్రమ రవాణా జరిగితే ఆసుపత్రుల లైసెన్స్‌ రద్దు!

పిల్లల అక్రమ రవాణా జరిగితే ఆసుపత్రుల లైసెన్స్‌ రద్దు!
 
ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పసి బిడ్డల అక్రమ రవాణా కేసుల్లో వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నేరాలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన మార్గ దర్శకాలను జారీ చేసింది. దవాఖానల్లో నవజాత శిశువులు అక్రమ రవాణాకు గురైతే వాటి లైసెన్సులు రద్దు చేయాలని స్పష్టంచేసింది. ఈ విషయంలో అలసత్వం వహిస్తే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించింది. కేసులను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

“ఎవరైనా మహిళ ప్రసవించడానికి హాస్పిటల్‌కు వచ్చినప్పుడు, ఆమెకు పుట్టిన నవజాత శిశువును అన్ని విధాలుగా కాపాడడం ఆ ఆస్పత్రి బాధ్యత. ఒకవేళ ఆస్పత్రి నుంచి ఆ నవజాత శిశువు అక్రమ రవాణా జరిగేతే ఆ ఆస్పత్రి లైసెన్స్‌ రద్దు చేయాలి” అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. చిన్నారుల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం 95 పేజీలతో కూడిన తీర్పును వెలువరించింది. 

ఇందులో 92 కీలక అంశాలను ప్రస్తావిస్తూ ధర్మాసనం ముందున్న అన్ని పిటిషన్లను ముగించింది. ఈ సందర్భంగా యుపిలో పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మందికి అలహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌ చేయకపోవడాన్ని తప్పుబట్టింది. చైల్డ్‌ ట్రాఫికింగ్‌కు సంబంధించి బాధితులు పింకితోపాటు మరో 17 స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లపై తీర్పులో కీలక అంశాలను ప్రస్తావించింది. 

తీర్పు ప్రతుల్ని అన్ని హైకోర్టులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదేశాలను హోంశాఖ, మహిళా-శిశుఅభివృద్ధి మంత్రిత్వశాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దేశంలో పిల్లల అక్రమ రవాణా కేసుల స్థితిగతులపై పూర్తి వివరాలు సమర్పించాలని, విచారణలు ఆరు నెలల్లోపు పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. 

సమయం సరిపోదు అనుకుంటే ప్రతిరోజూ ఆ కేసులను విచారణ చేపట్టాలని పేర్కొంది. అపహరణకు గురైన పిల్లలను గుర్తించి విద్యా చట్టం కింద వారిని పాఠశాలల్లో చేర్పించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఎవరైనా పాటించకపోతే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఒక మీడియా సంస్థ నివేదికను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఢిల్లీ లోపల, బయట అక్రమ రవాణా గ్యాంగ్‌లకు సంబంధించిన కేసులో పోలీసులు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. 

ఈ అంశంపై ఈ నెల 21న విచారణ చేపడతామని వెల్లడించింది. తీర్పులో భాగంగా పిల్లల తల్లిదండ్రులకు సర్వోన్నత న్యాయస్థానం పలు సూచనలు చేసింది. “పిల్లలు చనిపోయినప్పటికంటే, అపహరణకు గురైనప్పుడు తల్లిదండ్రులు ఎదుర్కొనే బాధ, వేదన భిన్నమైంది. పిల్లలు చనిపోయినప్పుడు కాలక్రమేణా మరిచిపోతారు కానీ, పిల్లలు తప్పిపోయి కనిపించనప్పుడు జీవితాంతం బాధ అనుభవించాల్సి ఉంటుంది. ఇది మరణం కంటే దారుణమైంది” అని పేర్కొంది.