తమిళనాడు స్వయంప్రతిపత్తికి స్టాలిన్ కమిటీ

తమిళనాడు స్వయంప్రతిపత్తికి స్టాలిన్ కమిటీ
బిల్లుల ఆమోదంపై గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి, తమిళనాడు ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతుండగా, ఎంకే స్టాలిన్‌ ప్రభుత్వం తాజాగా వివాదాస్పద  నిర్ణయం తీసుకుంది. తమిళనాడు స్వయంప్రతిపత్తిపై సూచనలకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పలు అంశాలపై తమిళనాడుకు, కేంద్రం మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో స్టాలిన్ తాజా నిర్ణయం తీసుకున్నారు.
 
స్వయంప్రతిపత్తి కోసం తీసుకోవాల్సిన చర్యలను ఆ కమిటీ సిఫారసు చేయనుంది. ఈ మేరకు సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు.  ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో మాజీ ఐఏఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఎం. నాగనాథన్ సభ్యులుగా ఉంటారు. 
రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆరోపించారు. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సంబంధాలను మెరుగుపరచేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దీనిపై కమిటీ రీసెర్చ్ చేసి నివేదిక అందిస్తుందని తెలిపారు. అసెంబ్లీ రూల్ నెంబర్ 110 కింద ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. ఈ నిబంధన కింద ముఖ్యమంత్రి లేదా మంత్రి చేసే ప్రకటనపై తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు విపక్షాలకు ఉండదు.
 
ఈ కమిటీ రాష్ట్ర స్వయంప్రతిపత్తిని నిర్ధారిస్తుంది. సిఫార్సులతో కూడిన తుది నివేదికను ఈ కమిటీ రెండేళ్లలో ప్రభుత్వానికి సమర్పించనుంది. వచ్చే జనవరిలో మధ్యంతర నివేదిక సమర్పించాలి. త్రిభాషా విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం తమపై హిందీని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని స్టాలిన్ ఆరోపించారు.  తమిళనాడు సర్కార్ జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించినందున, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన రూ. 2500 కోట్లు నిధులను ఆపేసిందని విమర్శించారు.
విద్యను ఉమ్మడి జాబితాకు మార్చడానికి అనుమతించే 42వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర జాబితాలో విద్య ఉండాలని డిమాండ్ చేశారు. కాగా, బిల్లుల ఆమోదంపై గవర్నర్‌, తమిళనాడు ప్రభుత్వం మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో స్టాలిన్ సర్కార్​కు ఉపశమనం లభించింది. పెండింగులో పెట్టిన పది బిల్లులు గవర్నర్‌ ఆమోదం పొందినట్టే భావించాలని న్యాయస్థానం స్పష్టం చేసిన నేపథ్యంలో వాటికి చట్టబద్ధమైన హోదా కల్పిస్తూ ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేసింది. 

ఈ పరిణామాల వేళ రాష్ట్ర స్వయంప్రతిపత్తిపై సూచనలకు కమిటీని ఏర్పాటు చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ తిరిగి ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపిన గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ను ఉల్లంఘించినట్లు సుప్రీంకోర్టు పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తిరిగి ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.