గ్రూప్‌1 పోస్టులను కాంగ్రెస్‌ నేతలు అమ్ముకున్నారా?

గ్రూప్‌1 పోస్టులను కాంగ్రెస్‌ నేతలు అమ్ముకున్నారా?
 
టీజీపీఎస్సీ గ్రూప్‌1 పోస్టులను కాంగ్రెస్‌ నేతలు అమ్ముకున్నారా? పోస్టుకో రేటు చొప్పున బేరం పెట్టారా? అంటూ నిరుద్యోగ జేఏసీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టాపర్లలో పలువురు కాంగ్రెస్‌ నేతల కుటుంబ సభ్యులు ఉన్నారని వారు పలు ఆధారాలను చూపుతున్నారు. గ్రూప్‌-1 జీఆర్‌ఎల్‌లో, టాపర్ల జాబితాలో అత్యధికులు కొత్తగా 2024లో దరఖాస్తుచేసిన వారేనని ఆరోపిస్తున్నారు.
 
రెండు పరీక్ష కేంద్రాల నుంచే 74 మంది టాపర్లు ఉండటం, ఒకే గదిలో రాసిన వారికి, పక్క పక్క బెంచీలు, వెనుక బెంచీల్లోని వారికి అత్యధిక మార్కులు రావడం వెనుక భారీ కుట్రదాగి ఉన్నదని నిరుద్యోగ జేఏసీ నేతలు జనార్దన్‌, మోతీలాల్‌ నాయక్‌ తదితరులు విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణలపై సీబీసీఐడీ చేత విచారణ జరిపించాలని నిరుద్యోగ జేఏసీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. జ్యుడీషియల్‌ కమిషన్‌ వేసి విచారణ జరపాలని కోరుతున్నారు. 
 
75 రోజుల్లో మూల్యాంకనం చేయడం, వరుస హాల్‌టికెట్‌ నంబర్లు కలిగిన 68 మందికి ఒకే మార్కులు రావడం, ఉర్దూలో పరీక్ష రాసిన 9 మందిలో ఏడుగురికి అత్యధిక మార్కులు రావడం వెనుక ఆంత్యర్యమేమిటని ప్రశ్నించారు. స్థానికేతర అభ్యర్థులకు కుల ప్రాతిపదికన రిజర్వేషన్‌ ఎలా ఇస్తారని పేర్కొంటూ ఎంపికైన అభ్యర్థుల ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ హాల్‌టికెట్లను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

అమెరికా నుంచి ఇలా వచ్చి, అలా పరీక్షలు రాసిన అభ్యర్థి ఏకంగా టాపర్‌ అయిపోయాడు. కోచింగ్‌ తీసుకోలేదు. టెస్ట్‌ సిరీస్‌ ప్రాక్టీస్‌ కూడా చేయలేదట. కానీ గ్రూప్‌-1 మెయిన్స్‌లో 502 మార్కులొచ్చాయి. ఇతను కాంగ్రెస్‌ నేత దగ్గరి బంధువట. కాంగ్రెస్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ కోడలు టాపర్‌గా నిలిచారు. సదరు అభ్యర్థి రోజుకు ఐదు గంటలే చదివారట. మిగతా వాళ్లేమో 16 గంటలకు చదివినా టాపర్లు కాలేదు. 

ఈ అభ్యర్థులే కాకుండా మరికొందరు కాంగ్రెస్‌ నేతల కుటుంబసభ్యులున్నట్టు నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ రెండోసారి నిర్వహించినప్పుడు ఓఎమ్మార్‌ షీట్లు అధికంగా రావడం, బయోమెట్రిక్‌ హాజరు అమలు చేయలేదన్న కారణంతో అభ్యర్థులు కోర్టుకెళ్లారు. కోర్టు పరీక్షను రద్దుచేసి, మళ్లీ నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. 

తీర్పును సవాల్‌ చేస్తూ టీజీపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం మారగానే టీజీపీఎస్సీ వైఖరి కూడా మారింది. హైకోర్టు పరీక్షను రద్దుచేసి, మళ్లీ ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించమంటే కాంగ్రెస్‌ సర్కారు ఏకంగా నోటిఫికేషన్‌నే రద్దుచేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలుచేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను కూడా ఉపసంహరించుకున్నది. 

ఇలా టీజీపీఎస్సీ వైఖరిని ఉన్నఫళంగా మార్చుకోవడం వెనుక బిగ్‌ స్కెచ్‌ దాగి ఉన్నట్టు నిరుద్యోగులు అనుమానిస్తున్నారు. కొత్త నోటిఫికేషన్‌లో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరు పెద్దలకు కావాల్సినవారు దరఖాస్తు చేసినవాళ్లున్నారట. అలాంటి వారిని ఒకే కేంద్రంలో పరీక్ష రాయించి, టాపర్లుగా నిలిపారు. ఇప్పుడు ఉద్యోగాలివ్వబోతున్నారని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు.