స్విట్జర్లాండ్‌కు పారిపోయేందుకు చోక్సీ స్కెచ్‌

స్విట్జర్లాండ్‌కు పారిపోయేందుకు చోక్సీ స్కెచ్‌
స్విట్జర్లాండ్‌కు పారిపోయేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు గుర్తించిన బెల్జియం పోలీసులు  పీఎన్‌బీ మోసం కేసులో నిందితుడైన వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీని బెల్జియం పోలీసులు ఈ నెల 12న అరెస్టు చేశార. ఈ ఆర్థిక నేరగాడి కదలికలపై నిఘా పెడుతూ వచ్చిన దర్యాప్తు సంస్థలు ఆయనకు సంబంధించిన సమాచారాన్ని ఆయా దేశాలతో పంచుకుంటూ వచ్చి, భారత్‌లో వాంటెడ్‌ అయిన వజ్రాల వ్యాపారిని ఎట్టకేలకు బెల్జియంలో అరెస్ట్‌ అయ్యేలా దర్యాప్తు సంస్థలు కృషి చేశాయి.
అతనిని భారత్ కు తీసుకు వచ్చేందుకు సీబీఐ, ఈడీ బృందాలు బెల్జియంకు బయలుదేరనున్నారు. ఈ రెండు సంస్థల ఉన్నతాధికారులు సమావేశమై ఈ విషయమై చర్చించారు. అవసరమైన పత్రాలను సమ్పరించి తమ అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించనున్నాయి. 
 
చోక్సీ నేరాలకు సంబంధించిన కీలక పత్రాలను, ఇతర సమాచారాన్ని అందించి అరెస్ట్‌ అయ్యేలా చేశాయి. గీతాంజలి గ్రూప్ యజమాని అయిన ఆయన తన మేనల్లుడు నీరవ్‌ మోదీ, అతని అమీ మోదీ, సోదరుడు నిషాల్‌ మోదీతో కలిసి పంజాబ్‌ నేషన్‌ బ్యాంక్‌లో రూ.12,636 కోట్లు రుణమోసం చేశారు. మోసం వెలుగు చూడడానికి కొద్ది రోజుల ముందు 2018లో దేశం విడిచిపారిపోయారు. 
 
పెట్టుబడుల పేరు చెప్పి ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నాడు. 2021లో చోక్సీని డొమినికన్‌ రిపబ్లిక్‌లోకి అక్రమంగా ప్రవేశించాడంటూ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆయనను కస్టడీలోకి తీసుకునేందుకు సీబీఐ బృందం కరేబియన్‌ దేశానికి చేరుకుంది. మెహుల్ చోక్సీ తరపు న్యాయవాదులు డొమినికన్ కోర్టును ఆశ్రయించారు. 
ఆయన చికిత్స కోసం ఆంటిగ్వాకు వెళ్లాల్సి ఉందని, ఆ తర్వాత విచారణను ఎదుర్కొనేందుకు తిరిగి వస్తానని కోర్టుకు తెలిపారు. దాదాపు 51 రోజుల పాటు జైలులో ఉన్న ఆయనకు కోర్టు బెయిల్‌ ఇచ్చింది.
దాంతో భారత్‌కు రాకుండా తృటిలో తప్పించుకోగలిగారు. ఈ సమయంలో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆయనపై నిఘా పెట్టింది.  కదలికలను బెల్జియంలో గుర్తించి, ఆ దేశ దర్యాప్తు సంస్థలకు సీబీఐ, ఈడీ సమాచారం అందించాయి. ఫ్రాడ్‌కు సంబంధించిన అన్ని పత్రాలు పంపారు. ఈ క్రమంలో చోక్సీ స్విట్జర్లాండ్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు బెల్జియం పోలీసులు గుర్తించారు. దాంతో వెంటనే ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

చోక్సీ భార్య ప్రీతి బెల్జియం పౌరురాలు. బెల్జియంలో రెసిడెన్సీ కార్డు పొందేందుకు ఆయన తప్పుడు పత్రాలు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. భారత్‌తో పాటు ఆంటిగ్వా పౌరసత్వం ఉన్న విషయాన్ని దాచి పెట్టారు. ఇదిలా ఉండగా బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం బెల్జియంలో ఉన్నందున భారత్‌కు తిరిగి రాలేనని ఫిబ్రవరిలో మెహుల్‌ చోక్సీ తరపు న్యాయవాది ముంబయి కోర్టుకు తెలిపారు. 

పరారీలో ఉన్న ఈ వ్యాపారవేత్త భారతీయ దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుపగా, ఈ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. మరో వైపు ఆయనను బెల్జియం నుంచి భారత్‌కు తీసుకువచ్చే దిశగా ఏజెన్సీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మెహుల్ చోక్సీ లీగల్‌ టీమ్‌ బెయిల్ కోసం దరఖాస్తు దాఖలు చేస్తామని, భారత్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తామని తెలిపింది.