బహుళ ప్రయోజనాల కోనోకార్పస్ మొక్కలను రక్షించుకుందాం

బహుళ ప్రయోజనాల కోనోకార్పస్ మొక్కలను రక్షించుకుందాం
తెలుగు రాష్ట్రాలలో బహుళ ప్రయోజనాలను అందిస్తున్న కోనో కార్పస్ మొక్కలను రక్షించుకుందామని ప్రముఖ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ ఎ.ఆర్. రెడ్డి, సిసిఎంబి పూర్వ డైరెక్టర్ డాక్టర్ సి.హెచ్. మోహన్ రావు, జన విజ్ఞాన వేదిక పూర్వ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఉస్మానియా యూనివర్సిటీ వృక్ష శాస్త్ర ప్రొఫెసర్ బి.ఎన్.రెడ్డి, జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, జీవ శాస్త్ర నిపుణులు గోపాలకృష్ణ పిలుపిచ్చారు. 
 
ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త, యోగివేమన విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ కోనోకార్పస్ మొక్కపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధనలు జరిపిన ప్రొఫెసర్ ఎ.ఆర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ మొక్కలన్నిటిలో అత్యధిక కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకొని అత్యధిక ఆక్సిజన్ ను అందిస్తున్న మొక్క కోనోకార్పస్ అని తన పరిశోధనలో తేలిందని తెలిపారు.
 
ప్రపంచవ్యాప్తంగా కోనోకార్పస్ పై జరిపిన పరిశోధనలన్నీ మంచి ప్రయోజనాలున్నాయని ఆయన చెప్పారు. తక్కువ నీరున్నా బ్రతుకుతుందని, ఎలాంటి నిర్వహణ వ్యయం ఉండదని పేర్కొంటూ తెలుగు రాష్ట్రాలలో అపోహలను నమ్మి మంచి ప్రయోజనాలు గల కోనోకార్పస్ మొక్కలను నరక వద్దని విజ్ఞప్తి చేశారు.  ప్రపంచంలో సగటున ఒక మనిషికి 421 మొక్కలు ఉండగా, బ్రెజిల్ లో 500, అమెరికాలో 470 ఉండగా భారతదేశంలో కేవలం 28 మొక్కలు మాత్రమే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
భూగర్భ జలాలను ఎక్కువ తీసుకుంటుందనే ప్రచారం అవాస్తవమని, నీటి లభ్యత లేని దుబాయ్, సౌదీ అరేబియాలో కోనోకార్పస్ మొక్కలను విరివిగా పెంచుతున్నారని తెలిపారు.  కోనోకార్పస్ గుబురుగా పెరగడం వల్ల పక్షులు గూళ్ళు పెట్టుకోలేవని స్పష్టం చేశారు. ప్రతి మొక్క నుండి అన్ని ప్రయోజనాలు పొందలేమని, కొన్ని పండ్లు ఇస్తాయని, కొన్ని పూలు ఇస్తాయని, మరికొన్ని నీడను, కలపను ఇస్తాయని వివరించారు. 
 
జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ బాధ్యతాయుత స్థానంలో, గౌరవప్రదమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కోనోకార్పస్ మొక్క ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తుందని పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలుగు రాష్ట్రాలలో వాల్టా చట్టాన్ని అమలు చేయడం లేదని, చెట్లను నరికిన వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. 
 
సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో చెట్లను నరకడం మనుషులను నరికినట్టే భావించాలని తీర్పునిస్తూ ప్రతి నరికిన చెట్టుకి లక్ష రూపాయల జరిమానా విధించిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కోనోకార్పస్ చెట్లను నరికే కార్యక్రమాన్ని కొనసాగిస్తే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేస్తామని ఆయన హెచ్చరించారు. 
 
మొక్కల మాఫియా అబద్దాలను ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనోకార్పస్ విదేశీ మొక్క అని ప్రచారం చేస్తున్నారని, మనదేశంలో ఉన్న సగం మొక్కలు విదేశాల నుండి వచ్చినవేనని గుర్తు చేశారు.