అమరావతి కోసం మరో 44 వేల ఎకరాలు

అమరావతి కోసం మరో 44 వేల ఎకరాలు
ఆంధ్రప్రదేశ్ వాసుల కలల రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే అమరావతి కోసం మరింత భూమిని సమీకరించాలని ఆలోచనలు చేస్తోంది. అమరావతి కోసం ఇప్పటికే 33 వేల ఎకరాల భూమిని సమీకరించగా, ల్యాండ్ పూలింగ్ ద్వారా మరో 44 వేల ఎక‌రాల అదనపు భూస‌మీక‌ర‌ణకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. 
 
అమరావతి చుట్టుపక్కల 11 గ్రామాలలో భూసమీకరణకు ఉన్న సాధ్యాసాధ్యాలను సీఆర్డీఏ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అమరావతిలో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, అమరావతి రైల్వే లైన్ నిర్మాణంతో పాటుగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాజధాని చుట్టుపక్కల మరో 44 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని సీఆర్డీఏ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఆ మేరకు తుళ్లూరు, తాడికొండ. అమ‌రావ‌తి, మంగ‌ళ‌గిరి మండ‌లాలోని కొన్ని గ్రామాల్లో భూసమీకరణ చేయనున్నట్లు తెలిసింది. తుళ్లూరు మండలంలోని పెద్దపరిణి, వడ్డమాను, హ‌రిచంద్రాపురంలో భూసమీకరణకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 
 
ఈ గ్రామాల్లోని 9919 ఎక‌రాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించేందుకు కసరత్తు జరుగుతోంది. అలాగే అమ‌రావ‌తి మండ‌లానికి సంబంధించి వైకుంఠపురం, కార్లపూడి, ఎండ్రాయి, మొత్తాడక, నిడముక్కల గ్రామాల‌లో 12,838 ఎక‌రాలను సమీకరించే ఆలోచనలో సీఆర్డీఏ ఉంది. ఇక తాడికొండ మండలంలోని తాడికొండ‌, కంతేరు గ్రామాలలో మరో 16,463 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించేందుకు సీఆర్డీఏ కసరత్తు చేస్తోంది. 
 
మంగళగిరి మండలం కాజా గ్రామంలోని 4492 ఎక‌రాల‌ను కూడా సమీకరించే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు అదనపు భూసమీకరణపై మరికొన్ని రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.