
తన జీవితంలో కాళ్లూ, చేతులూ ఆడినంత కాలం సమాజం కోసం పని చేస్తానని తాను ఉద్యోగ విరమణ సమయంలో చెప్పానని గుర్తు చేస్తూ ఆ మాట ప్రకారం రాజకీయాల్లోకి వస్తున్నానని రిటైర్డ్ డిజిపి ఎబి వెంకటేశ్వరరావు ప్రకటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో, అమలాపురంలో ఆయన ఆదివారం పర్యటించారు.
ముమ్మిడివరం మండలం ఠానేలంకలో వైఎస్.జగన్ మోహన్ రెడ్డిపై దాడి కేసులో బెయిల్‌పై ఉన్న నిందితుడు జనుపల్లి శ్రీనుతోపాటు ఆయన కుటుంబ సభ్యులను వెంకటేశ్వరరావు పరామర్శించారు. శ్రీనుతో మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ బాధితులకు న్యాయం చేయడానికి తన పోరాటం మొదలైందని తెలిపారు.
అందులో భాగంగానే జనుపల్లి శ్రీనుకు సహకారం అందించేందుకు వచ్చానని చెప్పారు. అక్రమాలు చేసే వారికి జగన్ పెద్దపీట వేస్తారని, తన స్వార్థం కోసం ప్రజలను కులాలు, వర్గాలుగా విభజిస్తారని విమర్శించారు. జగన్ అక్రమాలు, అన్యాయాలను బయట పెడతానని, జగన్ బాధితులకు అండగా ఉంటానని తెలిపారు.
తాను పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తున్నానని, ఈ న్యాయ పోరాటం విజయవంతం చేయడానికి ప్రజల మద్దతు కావాలని కోరారు. కోడి కత్తి శ్రీను చేసిన పొరపాటుతో మూడు రేట్లకు మించిన శిక్ష అతడు అనుభవించాడని విచారం వ్యక్తం చేశారు. ఈ కేసులో బెయిల్‌పై అతడు ఉపాధి కోసం ఏ పనికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆ కుర్రాడి భవిష్యత్తు నాశనం అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయినా జాలి లేకుండా ఈ కేసులో ఇంకా కేసులు వేస్తున్నారంటూ వైఎస్ జగన్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోడి కత్తి కేసులో ఎన్నో అబద్ధాలు రాశారని ఆయన మండిపడ్డారు. ఛార్జ్ షీట్ వేసి ఆరేళ్ళు అయిందని గుర్తు చేశారు. ఇంకా ఈ కేసు విచారణ పూర్తి కాలేదని, విచారణలో భాగంగా కేసులపై కేసులు వేసి ఈ కేసు ముందుకు సాగకుండా అడ్డుకొంటున్నాడంటూ వైఎస్ జగన్‌పై ఏబీ వెంకటేశ్వరరావు నిప్పులు చెరిగారు.
ఈ కేసును విజయవాడ నుంచి విశాఖపట్నానికి బదిలీ చేశారని,ఇప్పటికీ స్టే కారణంగా ఈ కేసులో వాదనలు లేవని పేర్కొన్నారు. స్టే వలన ఇప్పటికీ కోడి కత్తి అసలు కేసు విచారణ మొదలవలేదని చెబుతూఈ కేసులో నేరం రుజువు కావాలి.. లేకుంటే ఈ కేసు కొట్టేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
More Stories
ఏపీ పట్టణాల్లో స్లీపర్సెల్స్ పై పోలీసుల డేగకన్ను
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలు
అమరావతిలో రూ 1 లక్ష కోట్ల పనులకు ప్రధాని మోదీ శ్రీకారం