జర్నలిస్టులు అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి!

జర్నలిస్టులు అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి!
సమాజంలో పెరుగుతున్న అవినీతి, పక్షపాతం, హామీలను అమలు పరచడంలో ప్రభుత్వాల వైఫల్యాలు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ అటువంటి వాటిని జర్నలిస్టులు ఎండగట్టాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉద్బోధించారు. హైదరాబాద్ లో జరిగిన నేషనల్ యూనియన్ అఫ్ జర్నలిస్ట్స్ (ఐ) జాతీయ మహాసభలలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ అవినీతి కాన్సర్ తో సమానమని స్పష్టం చేశారు.
 
ప్రజాజీవనంలో విలువలు తగ్గిపోతున్నాయని, కుల, మత, ప్రాంతీయ తత్వాలతో పాటు పక్షపాతం ప్రదర్శిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు ప్రజలలో చైతన్యం కలిగించడంలో అత్యంత బలమైన సాధనాలని పేర్కొంటూ నిర్భయంగా, వాస్తవాలను ప్రజలకు తెలియపరచాలని ఆయన కోరారు.
 
వార్తను వార్తగా మాత్రమే ఇవ్వాలని, వార్తలలో అభిప్రాయాలను చేర్చరాదని స్పష్టం చేస్తూ మీడియా పారదర్శకతకు, నిస్పక్షపాతంకు దర్పణం పట్టాలని దత్తాత్రేయ తెలిపారు. జర్నలిస్టులు అందించే వార్తలలో నిజాయతీని బట్టే మీడియా పట్ల ప్రజలలో విశ్వసనీయత ఏర్పడుతుందని ఆయన చెప్పారు. గతంలో అరుణ్ శౌరి వంటి జర్నలిస్టులు నిర్భయంగా, అత్యున్నత స్థాయిలో అవినీతిని బట్టబయలు చేసి ప్రభుత్వాలనే వణికించారని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేశారు. 
 
జర్నలిస్టులు పేదలు, గ్రామీణ ప్రజలు, రైతులు, అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు చెందిన సమస్యల గురించి అవగాహన కల్పించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆయన చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వాలు విజయవంతంగా అమలు పరుస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు ఏమేరకు అణగారిన వర్గాలకు అందుతున్నాయో, వారేమాత్రం ప్రయోజనం పొందుతున్నారో కూడా మీడియా తెలియపరచాలని తెలిపారు.
 
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వాతంత్య్రం అత్యంత ప్రధానమైనదని చెబుతూ జర్నలిస్టుల రక్షణ పట్ల ప్రభుత్వాలు బాధ్యత వహించాలని దత్తాత్రేయ తెలిపారు. అదేవిధంగా వారికి తగిన జీతభత్యాలు, గృహవసతి, విద్య-వైద్య సదుపాయాలు అందేవిధంగా కూడా చూడాలని చెప్పారు.
 
ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియాను పునరుద్ధరించి, విస్తృతమైన పరిధిలో, పటిష్టంగా పనిచేసే విధంగా మీడియా కమిషన్ గా అభివృద్ధి చేయాలని ఎన్ యు జె (ఐ) జాతీయ అధ్యక్షులు శివాజీ సర్కార్ డిమాండ్ చేశారు.  ప్రత్యామ్న్యాయ వార్తా సాధనాలు పెరుగుతున్న దృష్ట్యా వెబ్ పోర్టల్స్, యూట్యూబ్ ఛానల్స్, ఇతర మీడియా సాధనలలో పనిచేస్తున్న వారిని సహితం వర్కింగ్ జర్నలిస్ట్స్ పరిధిలోకి తీసుకు రావాలని స్పష్టం చేశారు.
 
దేశంలో మీడియా వ్యక్తులపై పెరుగుతున్న బెదిరంపులు, దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ వారికి రక్షణ కల్పించేందుకు పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని శివాజీ సర్కార్ సూచించారు. మీడియా ప్రాధమిక విలువలకే ముప్పు ఏర్పడుతున్న ప్రస్తుత వాతావరణంలో దేశ వ్యాప్తంగా జర్నలిస్టులు తాము పనిచేస్తున్న పరిస్థితుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన పిలుపిచ్చారు. జర్నలిస్టులు ఉమ్మడిగా ఈ సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
 
 జర్నలిస్టులకు నూతన వేజ్ బోర్డును ఏర్పాటు చేసి, అన్ని రకాలైన జర్నలిస్టులను దాని పరిధిలోకి తీసుకు రావాలని జర్నలిస్ట్స్ యూనియన్ అఫ్ ఇండియా (ఐ) సెక్రటరీ జనరల్ రవి  మీనాక్షి సుందరం కోరారు. యూనియన్ మాజీ అధ్యక్షులు ఉప్పల లక్ష్మణ్, ఉపాధ్యక్షులు సంజయ్ రాయ్, సవితా కులకర్ణి తదితరులు కూడా ప్రసంగించారు.
 
రెండు రోజుల సమావేశాలు నేడు జర్నలిజం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలపై దృష్టి సారించింది. గ్రాస్‌రూట్ రిపోర్టింగ్‌పై డిజిటల్ మీడియా ప్రభావం నుండి పెరుగుతున్న ప్రాంతీయ, స్థానిక జర్నలిజాన్ని రక్షించాల్సిన అవసరం గురించి చర్చించారు. సీనియర్ జర్నలిస్టులు, ఎడిటర్లు, కరస్పాండెంట్లతో సహా భారతదేశం అంతటా ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు,అనుభవాలను పంచుకున్నారు. నేటి వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ల్యాండ్‌స్కేప్‌లో నైతిక జర్నలిజాన్ని నిర్వహించడంలో ఉన్న సవాళ్లను అన్వేషించారు.