
రాష్ట్రంలో రామరాజ్యం తేవాలనేదే తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీరాముడి స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు చేయడమే తన ధ్యేయమని చెప్పారు. ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.
ఒంటిమిట్టలో అత్యంత వైభవంగా సీతారాముల కల్యాణాన్ని జరుపుకొన్నామని వారిద్దరిదీ ఆదర్శ దాంపత్యమని సీఎం చెప్పారు. పరిపాలన అంటే సాక్షాత్తూ శ్రీరాముడి పాలన గుర్తుకురావాలని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు భద్రాచలంలో రాములోరి దర్శనం చేసుకొనేవాళ్లమని అక్కడే వైభవంగా కల్యాణం జరిపేవాళ్లని అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఒంటిమిట్టలో అత్యంత వైభవంగా కోదండరాముడి కల్యాణాన్ని జరపాలని ప్రభుత్వపరంగా ఆదేశాలు జారీ చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు.
అప్పటినుంచి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చామని, అభివృద్ధిలో భాగంగానే ఒంటిమిట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకొచ్చినట్లు సీఎం తెలిపారు. ఈ ఆలయాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. టెంపుల్ టూరిజంలో భాగంగా ఒంటిమిట్ట ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆలయం పక్కనే ఉన్న చెరువు బ్యూటిఫికేషన్ పనులను ప్రారంభించామని తెలిపారు.
ఇక్కడికి ఎవరు వచ్చినా రెండు మూడు రోజలు ఉండేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. దేవాలయాలు మన వారసత్వ సంపదదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. దేవాలయాలు లేకపోతే మన కుటుంబ వ్యవస్థ ఉండేది కాదని చెబుతూ ప్రపంచంలో ఏ దేశానికీ లేని గొప్ప వారసత్వ సంపద భారతదేశానికి ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి గొప్ప వారసత్వ సంపదను మన భవిష్యత్ తరాలకు అందించాలని సీఎం పిలుపునిచ్చారు.
More Stories
ఏపీ పట్టణాల్లో స్లీపర్‌సెల్స్ పై పోలీసుల డేగకన్ను
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలు
అమరావతిలో రూ 1 లక్ష కోట్ల పనులకు ప్రధాని మోదీ శ్రీకారం