టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందడం అవాస్తవం

టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందడం అవాస్తవం
 
తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని టీటీడీ స్పష్టం చేసింది. మృతి చెందిన గోవుల ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావని తెలిపింది.  కొంతమంది దురుద్దేశంతో ఆ ఫొటోల్లో ఉన్నవి టీటీడీ గోవులుగా చూపిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వెల్లడించింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నామని టీటీడీ తెలిపింది.
 
టీటీడీ గోశాలలో ఆవులు మృతి చెందాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న నిరాధారమైన విషప్రచారాన్ని మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా 
ఖండించారు. ఆవులు మృతి చెందాయన్న వాదనలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.  ప్రజల్ని తప్పుదారి పట్టించటానికి వైఎస్సార్సీపీ చేస్తున్న రెచ్చగొట్టే ప్రచారాలు భక్తులు నమ్మొద్దని లోకేశ్ కోరారు. రాజకీయ లబ్ధి కోసం పవిత్ర సంస్థల గురించి అబద్ధాలు వ్యాప్తి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
 
సోషల్‌ మీడియా వేదికగా టిటిడి మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి ఆరోపించారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎస్వీ గోశాలపై దుష్ప్రచారం చేయడం దారుణమని ధ్వజమెత్తారు.
 
కాగా, టీటీడీ అధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గత మూడు నెలలుగా వందకుపైగా ఆవులు చనిపోతున్నా పట్టించుకోకుండా ఉన్నారని కరుణాకర్ రెడ్డి  విమర్శించారు. చనిపోయిన గోవులను పోస్టు మార్టం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా తరలించారని ఆరోపించారు. గోశాలపై పర్యవేక్షణలో అధికారి లేకపోవడంతోనే ఈ దుస్థితి ‌‌ ఏర్పడిందని చెబుతూ గోవుల మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.