నర్సింగ్‌ కోర్సులకు ప్రత్యేకంగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష

నర్సింగ్‌ కోర్సులకు ప్రత్యేకంగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష
ఏపీలో నర్సింగ్‌ కోర్సుల్లో చేరేందుకు ప్రత్యేకంగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్‌) నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షను ఏటా జూన్‌ రెండవ వారంలో పూర్తి చేయాలని సూచించారు.  విజయవాడలోని ఎన్‌టిఆర్‌ విశ్వవిద్యాలయంలో నర్సింగ్‌ కళాశాలల అసోసియేషన్‌ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఏటా వివిధ కారణాలతో నవంబరులో జరుగుత్ను నర్సింగ్‌ కోర్సుల ప్రవేశాలను ఇకపై జులై నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 
 
రాష్ట్రంలో బిఎస్సి (నర్సింగ్‌) కోర్సుల్ని అందించే కళాశాల్లో ఏటా 13 వేల మంది ప్రవేశిస్తున్నారు. ఇదివరకు కేంద్రం నిర్వహించే నీట్‌, రాష్ట్రాల స్థాయిలో ఎంసెట్‌ వంటి పోటీ పరీక్షల ఆధారంగానే నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు. 
 
నర్సింగ్‌ విద్య అభ్యసించాలనుకునేవారికి ఈ విషయంలో కొన్ని అవరోధాలున్నాయని, అందువల్లే నర్సింగ్‌ కోర్సులకు విడిగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్‌) నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తామని, ఇంటర్‌లో బైపిసి గ్రూపు వాళ్లు పరీక్షకు అర్హులని తెలిపారు.
జిఎన్‌ఎం నర్సింగ్‌ కోర్సుల్లో కూడా సెట్‌ ద్వారానే అడ్మిషన్లు చేపట్టేందుకు బోర్డు ఆఫ్‌ ఎక్జామినేషన్స్‌ను ఏర్పాటు చేయాలని సమావేశంలో సూచన రాగా..అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
 
ఈ కోర్సులకు వార్షిక బోధనా రుసుము రూ.15 వేలు, నాలుగేళ్ల బిఎస్సి (నర్సింగ్‌) కోర్సులకు రూ.19 వేలుగా నిర్ధారించడం వల్ల నాణ్యమైన నర్సింగ్‌ విద్యను అందించేందుకు సమస్యలు వస్తున్నాయని అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు.  అయితే నిర్ధారిత ఫీజుల కంటే అధికంగా నర్సింగ్‌ విద్యా సంస్థలు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని ఈ విషయంలో యాజమాన్యాల వైఖరి మారాలని చెప్పారు. 
 
ప్రజారోగ్య పరిరక్షణలో నర్సులు పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమైనదని చెబుతూ నర్సింగ్ రంగ అభివృద్ధికి, నర్సుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి భరోసా  ఇచ్చారు. వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సినా అండగా ఉంటుందని చెప్పారు. నర్సులు నైపుణ్య అభివృద్ధి, కొత్త పద్ధతులను నేర్చుకోవడం కొనసాగించాలని, అప్పుడే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించగలమని తెలిపారు. 
 
ఈ సమావేశంలో హై పవర్‌ కమిటీ అధ్యక్షులు,  హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, ఎన్‌టిఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌, డిఎంఇ డాక్టర్‌ నర్సింహం, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి, స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ కార్యదర్శి సుశీల, హెచ్‌పిసి కార్యదర్శి వేణికళ పాల్గొన్నారు.