
రోడ్డుపై ఓ ముస్లిం యువతితో హిందూ యువకుడైన ఓ పిజ్జా డెలివరీ బాయ్ మాట్లాడుతూ కనిపించాడు. వీరిద్దరూ మాట్లాడుకోవటం మరో ముస్లిం యువకుడి కంట పడింది. వాళ్లిద్దరూ అలా మాట్లాడుకోవటం చూసి ఏం అర్థం చేసుకున్నాడో ఏమో కానీ వెంటనే ఫోన్ తీసి ఆ దృశ్యాన్ని వీడియో చేసి తర్వాత దాడికి ఉపక్రమించాడు. ఈ సందర్భంగా 29 మంది యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ములుగు జిల్లా నర్సాపూర్‌కు చెందిన కొండం సాయిచరణ్ వరంగల్‌లోని న్యూ శాయంపేటలో నివాసముంటున్నాడు. ఉపాధి కోసం డామినోస్ పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. సాయిచరణ్ సోదరి కూడా నగరంలోని ఓ వెహికిల్ షో రూంలో విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తన అక్కతో పాటు పని చేస్తోన్న జాన్‌పీరీలు ప్రాంతానికి చెందిన ముస్లిం యువతితో సాయిచరణ్‌కు పరిచయం ఏర్పడింది.
అయితే ఆ షోరూంలో తనకు ఇచ్చే జీతం సరిపోవట్లేదని, వేరే ఎక్కడైనా ఉద్యోగం ఉంటే చెప్పాలని సాయిచరణ్‌ను ముస్లిం యువతి కోరింది. పలుమార్లు ఉద్యోగం గురించి అడగటంతో తనకు తెలిసిన వారిని సాయిచరణ్ అడుగుతూ ఉండగా హనుమకొండ చౌరస్తాలోని ఓ కన్సల్టెన్సీలో ఉద్యోగం ఉందని తెలిసింది. ఇదే విషయాన్ని ఆ ముస్లిం యువతికి చెప్పాడు.
దీంతో శనివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఆ కన్సల్టెన్సీకి ఇంటర్వ్యూ కోసం వెళ్లింది. అనంతరం సాయిచరణ్, ఆ యువతి కలిసి హనుమకొండ చౌరస్తాలో రోడ్డుపై నిలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్లిద్దరినీ అజీమ్ అనే యువకుడు చూశాడు. వాళ్లు మాట్లాడుకుంటుండటం చూసిన అజీమ్ వెంటనే మొబైల్‌లో వీడియోలు రికార్డ్ చేశాడు.
వీడియో తీసిన తర్వాత నేరుగా సాయిచరణ్ దగ్గరికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. అదేక్రమంలో సాయిచరణ్‌ను తన బైక్ మీద బలవంతంగా ఎక్కించుకుని అలంకార్ జంక్షన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఇర్షాద్, ముజ్జుతో పాటు మరికొందరు యువకులతో కలిసి సాయిచరణ్ మీద దాడి చేశారు. అక్కడి నుంచి జాన్‌పీరీలలోని ముస్లిం యువతి ఇంటికి తీసుకెళ్లారు.
అక్కడి వెళ్లిన తర్వాత మరోసారి సాయిచరణ్ మీద దాడి చేశారు. సాయిచరణ్ ప్యాంటుకు ఉన్న బెల్టు తీసి దానితోనే చితకబాదారు. అక్కడి నుంచి మండి బజార్ ఏరియాకు తీసుకొచ్చి.. గ్రీన్ బావర్చి హోటల్ వెనుక ఉన్న ఓ పురాతన భవనంలో బంధించగా ఇంకొంతమంది వచ్చి కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో సాయిచరణ్ తీవ్రంగా గాయపడి సొమ్మసిల్లి పడిపోయాడు.
దీంతో సాయిచరణ్‌ను సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. అక్కడ వైద్యులు గమనించి చూస్తే ఒళ్లంత వాతలు కనిపించాయి. సాయిచరణ్‌కు స్పృహ వచ్చిన తర్వాత ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక చికిత్స అనంతరం స్థానికుల సహాయంతో హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సాయిచరణ్ పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించాడు.
దాడి చేసిన యువకులపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎండీ అజీమ్, షేక్ అప్సర్, ఎండీ ఇర్షాద్, ముజ్జు, శహబాజ్, మహమ్మద్, ఫయాజ్, నెహాల్ సహా మొత్తం 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఆరుగురిని ఆదివారం (మార్చి 23న) రిమాండ్‌కు తరలించగా, మిగతా వాళ్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
ఏపీ పట్టణాల్లో స్లీపర్‌సెల్స్ పై పోలీసుల డేగకన్ను