ముస్లిం రేజర్వేషన్లపై డికె వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం

ముస్లిం రేజర్వేషన్లపై డికె వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం
మతపరమైన రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని మార్చాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వ్యాఖ్యానించారంటూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో లోక్‌సభ, రాజ్యసభ అట్టుడికిపోయాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు సోమవారం ఉభయసభల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. 
 
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఓ వ్యక్తి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటన చేశారని, అది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ సిద్దరామయ్య సర్కారు చట్టం చేసిన సంగతి తెలిసిందే. 
 
ఇదే క్రమంలో మతపరమైన రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వ్యాఖ్యానించారంటూ బీజేపీ ఆందోళనకు దిగింది. అంబేడ్కర్‌ ఫొటో పట్టుకొని తిరగడంతో పాటు రాజ్యాంగ ప్రతిని జేబులో పెట్టుకొని తిరిగే కాంగ్రెస్‌ నేతలు ముస్లింలకు రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని మార్చాలంటారా? దీనిపై ఆ పార్టీ వివరణ ఇవ్వాల్సిందేనని, అతనిపై చర్యలు తీసుకుంటారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. 
 
దీనిపై కాంగ్రెస్‌ సభ్యులు నిరసన తెలిపారు. అదే సమయంలో రాజ్యసభాపక్ష నేత జేపీ నడ్డా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో ముస్లింల రిజర్వేషన్‌ కోసం చేసిన చట్టాలను, నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.
 
మరోవైపు, భారత్‌ను ముక్కలు చేయాలని చూస్తున్నదే బీజేపీ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలని డీకే అనలేదని స్పష్టం చేశారు.  అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరని చెప్పారు. రిజర్వేషన్లపై శివకుమార్‌ చేసిన ప్రకటనను బిజెపి వక్రీకరించిందని విమర్శించారు. బిజెపి సభ్యులు పట్టు వదలకుండా పదే పదే ఆందోళనలకు దిగుతూ బిగ్గరగా నినాదాలు చేయడంతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. లోక్‌సభలో కూడా పాలక సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు.

 
జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసును మరుగునపడేసేందుకే బీజేపీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఖర్గే ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నడ్డా ముస్లింలకు రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్‌ కేవలం కర్ణాటకలోనే కాదని, తెలంగాణలోనూ చట్టం చేసిందని ఆరోపించారు. ముస్లింలను ఓబీసీలుగా పేర్కొంటూ దొడ్డిదారిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తోందని విమర్శించారు. 
 
ఇక రాజ్యసభలో కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ జైరాం రమేశ్‌ కేంద్ర మంత్రి రిజిజుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. పాలక పక్షమే పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేయడం కొత్త ధోరణిగా వుందని ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు. మరోవంక, డీకే శివకుమార్‌పై ఆరోపణలతో కాంగ్రెస్‌ అధిష్ఠానం అప్రమత్తమైంది. ఈ విషయమై వివరాలు తెలుసుకోవాలని పార్టీ అగ్రనేత చిదంబరాన్ని ఆదేశించింది. ఆయన డీకే శివకుమార్‌కు ఫోన్‌ చేయగా తన వ్యాఖ్యలను వక్రీకరించారని డీకే వివరణ ఇచ్చినట్లు తెలిసింది. బీజేపీ నాయకుల కుట్ర అని చెప్పినట్లు సమాచారం. కోర్టు తీర్పులకు అనుగుణంగా సవరణలు చేసే వీలుందనే చెప్పానని, రాజ్యాంగాన్ని మార్చాలని అనలేదని చెప్పినట్లు తెలిసింది.