బిజెపిపై విషం కక్కడమే వారి అజెండా!

బిజెపిపై విషం కక్కడమే వారి అజెండా!
 చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీని వ్యతిరేకించే పక్షాలు- కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు సమావేశమవడంపై కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.  పైకి నియోజకవర్గాల పునర్విభజన అని చెప్తున్నప్పటికీ, వాస్తవానికి వారి ఎజెండా బీజేపీపై విషం కక్కడమేననేది స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. 

అసలు నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధివిధానాలు  ఖరారు కానే కాలేదు, నియమ నిబంధనలు రూపొందించనే లేదు, కానీ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ ఈ పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం వారి దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ ధ్వజమెత్తారు.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో గ్యారెంటీల హామీల అమలు వైఫల్యాలతో కాంగ్రెస్, తమిళనాడులో అవినీతి కుటుంబ పాలనతో డీఎంకే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటున్నాయని ఆయన గుర్తు చేశారు. అటు బీఆర్ఎస్ అధికారం కోల్పోయి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేక పోగా, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేసే ధైర్యం కూడా చేయలేదని చెప్పారు.

ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించి, భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన తీసుకువచ్చేందుకు కుట్రలు పన్నుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని   గుర్తు చేశారు. వరుసగా మూడోసారి మోదీ అధికారంలోకి రావడమే కాకుండా 15 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా, మరో 6 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్డీఏ పక్షాలు అధికారంలో ఉన్నాయని తెలిపారు.

బీజేపీ రోజురోజుకు విస్తరిస్తూ ఉంటే, కాంగ్రెస్ కుచించుకుపోతుందని, నేడు కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారానికి పరిమితమైందని చెప్పారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వివిధ ఎజెండాలతో సమాజంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి మండిపడ్డారు.  2016లో జె ఎన్ యు లో తుక్డే తుక్డే గ్యాంగ్ ను ముందుపెట్టి విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నించి విఫలమైందని ఆయన తెలిపారు. 

ఆ తర్వాత బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ, రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. అవేవీ పారకపోవడంతో ఇప్పుడు డీలిమిటేషన్ కింద దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ సరికొత్త కుట్రలకు తెరలేపిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను ముందు పెట్టి ఉత్తర-దక్షిణ భారతదేశం మధ్య విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.

తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే, ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబపాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని,  రూ.700 కోట్ల లిక్కర్ కుంభకోణం సహా వరుసగా స్కాములు బయటపడడం ఆ వ్యతిరేకతను మరింత పెంచుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజల మధ్య భావోద్వేగాన్ని రెచ్చగొట్టేందుకు జాతీయ విద్యావిధానంలో త్రిభాషా సూత్రాన్ని చూపి, హిందీని బలవంతాన రుద్దుతున్నారని తప్పుడు కథనాన్ని తీసుకొచ్చారని ఆయన విమర్శించారు.

ప్రైవేటు స్కూళ్లలో ఇప్పటికే త్రిభాషా సూత్రం అమలవుతుండడంతో ప్రజలు వాస్తవం అర్థం చేసుకుంటున్నారని, దీంతో డీలిమిటేషన్ లో తమిళనాడుకు, దక్షిణాదికి అన్యాయం అవుతుందన్న మరో కృత్రిమ వాదాన్ని స్టాలిన్ సృష్టించారని ఆరోపించారు. దీనికి కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు తదితర పక్షాలు తందానా అంటున్నాయని పేర్కొంటూ  కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అన్న మా ఆరోపణలు నిజమని మరోసారి నిరూపితమైందని స్పష్టం చేశారు.

దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగకుండా, అన్ని రాష్ట్రాలను సంప్రదించి, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా, దేశహితమే లక్ష్యంగా డీలిమిటేషన్ చట్టాన్ని ప్రధాని మోదీ తీసుకొస్తారని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు.