
‘సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా, సమాజం, దేశంలోని అన్ని అంశాలను స్పృశించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లక్ష్యంగా పెట్టుకుందని అఖిల భారత సహా సర్ కార్యవాహ అరుణ్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో, నేడు 134 ప్రముఖ సంస్థలలో సంఘ్ పనిచేస్తుండగా, రాబోయే సంవత్సరాల్లో అన్ని సంస్థలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
బెంగళూరులో జరుగుతున్న మూడు రోజుల అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలలో విశ్లేషణ, సంస్థాగత పని పరిణామం, సమాజ ప్రభావం, పరివర్తనను సమీక్షించినట్లు మీడియా సమావేశంలో తెలిపారు. గత 100 సంవత్సరాలుగా తాము విస్తరణ, సంఘటన అన్న రెండు కీలక అంశాలపై శ్రద్ధగా చర్చిస్తూ, విశ్లేషించుకుంటున్నామని, ఇవే సామాజిక పరివర్తనకు దోహదపడతాయని పేర్కొన్నారు.
సంఘ శతాబ్ది ఉత్సవాల సమయంలో పురోగతిని అంచనా వేయడం, ప్రయత్నాలను వేగవంతం చేయడం అత్యంత సహజమైన చర్య అని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం అని కూడా అరుణ్ కుమార్ తెలిపారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే తమ ప్రాథమిక లక్ష్యమని, సంఘ్ ను కేవలం ఓ సంస్థగా కాకుండా, పరివర్తనకు అంకితమైన ప్రజల ఉద్యమంగా తాము భావిస్తున్నామని చెప్పారు.
నిజమైన సామాజిక పరివర్తన అనేది చట్టాల ద్వారా మాత్రమే సాధించబడదని, దీనికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం అత్యంత ఆవశ్యకమని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రయాణం గురించి ఆయన మీడియాకు వివరిస్తూ ఒకే శాఖ నుండి మొత్తం దేశానికి దాని క్రమంగా విస్తరించామని, దేశంలోని మారుమూల, గిరిజన ప్రాంతాలలో నేడు సంఘ్ పనిచేస్తుందని చెప్పారు. ఉదాహరణకు, ఒడిశాలోని కోరాపుట్, బోలాంగిర్‌లోని జంజాటి (గిరిజన) ప్రాంతాలలో 1031 శాఖలు ఉన్నాయని, వాటిలో ఆ వర్గాలకు చెందిన కార్యకర్తలు ఉన్నారని తెలిపారు.
గత సంవత్సరం మహిళా సాధికారతపై చేసిన పని గురించి వివరిస్తూ, దాదాపు 1.5 లక్షల మంది పురుషులు, మహిళా ప్రముఖులను సంప్రదించి వారితో పరస్పర చర్యలు నిర్వహించినట్లు అరుణ్ కుమార్ తెలిపారు. సంఘ్ పనిని విస్తరించడం అంటే ఆర్‌ఎస్‌ఎస్ సంఖ్యా బలం పెరుగుదల కాదని, కానీ అది సమాజపు సానుకూల బలం పెరుగుదలను సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆరు సంవత్సరాల క్రితం తాము నిర్దిష్టమైన లక్ష్యాలను గుర్తించామని, వాటిపై తగిన వార్షిక సమీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొంటూ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సమయంలో ఆ లక్ష్యాల పురోగతిని అంచనా వేసుకోవడానికి తగిన సందర్భమిదేనని ఆయన చెప్పారు. సంఘ విస్తరణ,గుణాత్మక వికాసం, సుప్తశక్తి జాగరణ అన్న మూడు కీలక అంశాలపై దృష్టి నిలిపామని తెలిపారు.
‘‘ప్రతి స్వయంసేవక్ కూడా చురుకైన కార్యకర్తగా వుండాలని కోరుకుంటున్నాం. నిన్న ముకుంద్ జీ చెప్పినట్లుగా మాకు కోటి మంది స్వయంసేవకులు ఉన్నారు. అందులో 60 లక్షలకు పైగా నిరంతరం, అప్రతిహతంగా మా కార్యవిస్తరణలో పాల్గొంటున్నారు. సుమారు 8 లక్షల మంది సంస్థాగత బాధ్యతల్లో వున్నారు. దైనందిన కార్యక్రమాల్లో వీలైనంత ఎక్కువ మంది పాల్గొనేలా మేము ప్రోత్సహిస్తున్నాం” అని అరుణ్ కుమార్ తెలిపారు.
ఆర్థిక, సామాజిక, విద్యా, మేధోపరమైన రంగాలతో పాటు సామాజిక రంగాల్లోని ప్రతిష్ఠిత వ్యక్తులతో నిర్మాణాత్మక సంబంధాలు కొనసాగిస్తామని, వీరంతా దేశ క్షేమం కోసం తమ దార్శనికతను పంచుకుంటారని ఆయన చెప్పారు. “మేము వారి నుంచి నిరంత సహకారం కోసం ప్రతయ్నాలు చేస్తాం. దీనికి సంబంధించిన కార్యకలాపాల ప్రణాళికను చేశాం’’ అని అరుణ్ కుమార్ తెలిపారు. అలాగే ఈ సమావేశాల్లో సంఘ శతాబ్ది సందర్భంగా తమ కార్యకలాపాలపై కూడా చర్చించామని, ప్రస్తుత పరిస్థితుల్లో తమ పాత్ర, బాధ్యతలకి సంబంధించిన అంశాలపై దృష్టి సారించామని వివరించారు.
1925 లో సంఘ్ స్థాపన జరిగిందని 1940 నాటికే దాదాపు అన్ని ప్రాంతాలకు విస్తరించామని, అలాగే 1972 నాటికి అన్ని జిల్లాలకు, 1996 నాటికి అన్ని బ్లాకులకు, పట్టణాలకు చేరుకున్నామని తెలిపారు. ప్రస్తుతం నూటికి నూరు శాతం ప్రాంతాలకు చేరుకుంటున్నామని వివరించారు. మండలాలు, బస్తీ స్థాయిల్లో కూడా భౌగోళికంగా విస్తరించడానికి తగిన లక్ష్యాలను నిర్దేశించుకున్నామని చెప్పారు.
లోక్‌మాతా అహల్యా దేవి హోల్కర్ 300వ జన్మదిన వేడుకల్లో భాగంగా, దేశవ్యాప్తంగా 22,000 కార్యక్రమాలు, మహానుభావురాలు లోక్‌మాతా అహల్యా దేవి సహకారాన్ని వ్యాప్తిచేసేందుకు అన్ని వర్గాల ప్రజలతో భారీ సమావేశాలు జరిగాయని తెలిపారు. అదే వేడుకల్లో భాగంగా, సమాజానికి మహిళల భాగస్వామ్యం, సహకారాన్ని పెంపొందించే కార్యక్రమాలు జరిగాయని చెప్పారు.
ఈ విషయంలో, సంవత్సరంలో 472 మహిళా కేంద్రీకృత 1-రోజు సదస్సులు నిర్వహించగా, వీటిలో 5.75 లక్షల మంది మహిళలు పాల్గొన్నారు. సంఘ్ ఎక్కడ సమస్య ఉన్నా పరిష్కారం కోసం కృషి చేస్తుందని చెబుతూ ఉదాహరణకు, మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో, నిర్లక్ష్యానికి గురవుతూ, సాధారణ జీవితాన్ని నిర్మించుకోవడానికి మార్గాలు లేని వికలాంగులైన పిల్లలు ఉన్నారని చెప్పారు. సంఘ్ కార్యకర్తలు అలాంటి పిల్లలను గుర్తించి, వారికి వైద్య సహాయం అందించడమే కాకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి జీవనోపాధి కోసం వివిధ మార్గాలను కూడా ఏర్పాటు చేశారని ఆయన వివరించారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోలు మృతి
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత