
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను 25 ఏళ్లపాటు వాయిదా వేయాలని, ప్రస్తుతమున్న లోక్‌సభ స్థానాలను యథాతథంగా కొనసాగించాలని అధికార డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ఉమ్మడి కార్యాచరణ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. పునర్విభజనకు వ్యతిరేకంగా కేంద్రంపై గట్టిగా గొంతెత్తిన స్టాలిన్‌కు ఏడు రాష్ట్రాల నుంచి గట్టి మద్దతు లభించింది.
చెన్నైలో శనివారం ఉదయం అధికార డీఎంకే ఆధ్వర్యంలో జరిగిన తొలి ఉమ్మడి కార్యాచరణ కమిటీ సమావేశంలో శిక్షించేలా కాదు.. న్యాయ సమ్మతంగా పునర్విభజన జరగాలంటూ వారంతా ఏకకంఠంతో నినదించారు. ఈ పోరాటంలో స్టాలిన్ వెంట ఉంటామని పలువురు నేతలు స్పష్టం చేశారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పోరాటం, మరోవైపు న్యాయపరమైన కార్యాచరణ దిశగా పని చేసేందుకు నిపుణులతో కమిటీని ఏర్పాటుచేయాలన్న స్టాలిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అందరూ ఆమోదించారు.
లోక్‌సభ స్థానాల పునర్విభజనను 25 యేళ్లపాటు వాయిదా వేస్తూ, పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని జేఏసీ సమావేశం తీర్మానించింది. ఎంపీ స్థానాల సంఖ్యను ఏమాత్రం తగ్గించడానికి వీల్లేదని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. ‘పునర్విభజన వల్ల నష్టపోతామని ఆందోళన చెందుతున్న రాష్ట్రాలకు చెందిన పార్టీలను ఆహ్వానించి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం జరపాలి.’ అని జేఏసీ కేంద్రాన్ని కోరింది.
పునర్విభజనను వ్యతిరేకిస్తున్న పార్టీలకు చెందిన ఎంపీలతో కోర్ కమిటీని ఏర్పాటుచేసుకుని, పార్లమెంటులో సమన్వయంతోను, స్పష్టమైన వ్యూహంతోను పనిచేయాలని నిర్ణయించింది. జేఏసీ సమావేశ వివరాలను డీఎంకే ఎంపీ కనిమొళి మీడియాకు వెల్లడిస్తూ తదుపరి జేఏసీ సమావేశం తెలంగాణ రాజధాని హైదరాబాద్ జరుగుతుందని తెలిపారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (సీపీఎం), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (కాంగ్రెస్), పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ (ఆప్), కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (కాంగ్రెస్), బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ నేతలు వినోద్‌కుమార్, సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఒడిశా మాజీ మంత్రి సంజయ్‌కుమార్ దాస్ బుర్మా, అమర్ పట్నాయక్ సింగ్ (బీజేడీ) హాజరయ్యారు.
పంజాబ్ రాష్ట్ర శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సర్దార్ బల్వీందర్ సింగ్, దల్జిత్‌సింగ్ సీమా, సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం, కాంగ్రెస్ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కె.సుధాకరన్, ముస్లిం లీగ్ నేత పీఎంఏ సలామ్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్, ఎంఐఎం ప్రతినిధి ఇంతియాజ్ జలీల్, కేరళకాంగ్రెస్ (మణి) ప్రతినిధి జోస్ కె.మణి, కేరళ కొట్టాయం కాంగ్రెస్ ఎంపీ జార్జి కె.ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. బీజేడీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్‌పట్నాయక్ వీడియోసందేశం పంపారు.
మరోవైపు సీఎం స్టాలిన్ నిర్వహిస్తున్న జేఏసీ సమావేశానికి వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఆ పార్టీ శ్రేణులు నల్ల దుస్తులు ధరించి నిరసనకు దిగారు. కావేరి, ముల్లైపెరియార్ నదీవివాదాలకు సంబంధించి కర్ణాటక, కేరళతో సీఎం స్టాలిన్ ఇలాంటి సమావేశాలు ఎందుకు నిర్వహించటం లేదని ప్రశ్నించారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోలు మృతి
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత