యూట్యూబర్‌ సన్నీ యాదవ్ కు పోలీసులు లుక్‌ఔట్ నోలీసులు

యూట్యూబర్‌ సన్నీ యాదవ్ కు పోలీసులు లుక్‌ఔట్ నోలీసులు
సూర్యాపేట నూతనకల్ పోలీస్‌స్టేషన్‌లో యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్‌పై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు నమోదు చేసిన పోలీసులు అతను సన్నీయాదవ్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించి లుక్ఔట్ సర్క్యూలర్ జారీ చేశారు. ఈనెల 5న సన్నీ యాదవ్‌పై బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌పై సుమోటో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా లుక్‌‌ఔట్ నోటీసులు జారీ చేశారు. 
 
త్వరలోనే అతడిని పట్టుకుంటామని సూర్యాపేట పోలీసులు చెబుతున్నారు. దేశ విదేశాల్లో బైక్‌పై రైడ్ చేస్తున్న సన్నీ యాదవ్.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్, సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశాడు. మరోవైపు సన్నీ యాదవ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని యూట్యూబర్ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా వేసింది.ఇక బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో మైనంపల్లి హనుమంతరావు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్‌ల్లో బెట్టింగ్ చేసి డబ్బు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మైనంపల్లి హనుమంతరావు ఫిర్యాదు చేశారు.

అలాగే ఓయూలో బెట్టింగ్ యాప్ ప్రోత్సహిస్తున్న వారిపై జనసేన విద్యార్థి విభాగం ఫిర్యాదు చేసింది. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్న జబర్దస్త్ వర్ష, హర్ష సాయిలపై జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్‌తో చావులకు కారణమైన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని పిర్యాదులో కోరారు. సినీ నటుడు అలీ సతీమణి జూబెద, లాస్య యూట్యూబ్ ఛానెల్స్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంపత్ నాయక్ డిమాండ్ చేశారు.