
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థలపై కేంద్రం కొరడా ఝళిపించింది. అక్రమంగా నిర్వహిస్తోన్న 357 వెబ్‌సైట్లను ఆర్థిక శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) బ్లాక్ చేసింది. ఆ గేమింగ్ సంస్థలకు చెందిన 2400 బ్యాంక్ ఖాతాలు సీజ్ చేసి, రూ.126 కోట్లను ఫ్రీజ్ చేసింది.
ఐటీ చట్టం కింద వాటిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. అలాగే, మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల అప్రమత్తం ఉండాలని, వాటిని ఎవరూ ఉపయోగించవద్దని డీజీజీఐ హెచ్చరించింది.
“సంస్థలను నమోదు చేయకుండా, ఆదాయాలను దాచిపెడుతూ జీఎస్టీ ఎగవేతలకు పాల్పడుతోన్న చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకున్నాం. ఐటీశాఖ సమన్వయంతో 357 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేశాం. వీటితో పాటు బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతోన్న సుమారు 700 సంస్థలపై నిఘా ఉంచాం” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశం వెలుపల ఈ తరహా సంస్థలు నడుపుతున్న పలువురు భారతీయులపై డీజీజీఐ మరో ఆపరేషన్ చేపట్టింది. వారికి చెందిన 166 ఖాతాలను బ్లాక్ చేసింది. అలాగే ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. “సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు ఈ సంస్థల ప్రచారంలో పాల్గొంటున్నారని గుర్తించాం. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, వాటికి దూరంగా ఉండాలి. ఆ ప్లాట్‌ఫామ్‌లు వ్యక్తుల ఆర్థిక భద్రతను దెబ్బతీయవచ్చు. దేశ భద్రతను దెబ్బతీసే కార్యకలాపాలకు అవి పరోక్షంగా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి” అని ఆర్థిక శాఖ హెచ్చరించింది.
More Stories
ట్రంప్ టారిఫ్‌లను నిలిపివేయాలని కోర్టుకు 12 రాష్ట్రాలు
అమెజాన్, వాల్‌మార్ట్‌లపై ఆంక్షలు తొలగింపుకై వత్తిడి
జులైలో పట్టాలపైకి దేశంలో తొలి హైడ్రోజన్ రైలు