
ఆరోగ్యవంతమైన రీతిలో పని – జీవితం మధ్య సమతుల్యత (వర్క్-లైఫ్ బ్యాలెన్స్) వుండాలని, ఇది ప్రతి ఉద్యోగి హక్కు అని ఐటి ఉద్యోగులు నినదించారు. కార్మిక చట్టాలను అమలు చేయాలని, పనిగంటలను క్రమబద్ధీకరించాలని, ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐటి హబ్ అయిన బెంగళూరులో వందల సంఖ్యలో టెక్ వర్కర్లు నిరసనలు నిర్వహిస్తున్నారు.
‘మేం ఇక బానిసలం కాదు.’ అని వారు నినదించారు. కర్ణాటక రాష్ట్ర ఐటి, ఐటి అనుబంధ రంగాల ఉద్యోగుల యూనియన్ (కెఐటియు) ఆధ్వర్యాన బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద ఐటి ఉద్యోగులు అరుణ పతాకాలు చేబూని నిరసన చేపట్టారు. నారాయణమూర్తి చిత్రపటాన్ని దగ్ధం చేశారు.
పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారి ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఐటి రంగంలో పని విధానం పట్ల దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఐటి ప్రముఖులు పలువురు పలు రకాలుగా దీనిపై తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు.
ఐటి పరిశ్రమలకు కేంద్రంగా మారిన బెంగళూరులో ఐటి రంగ ఉద్యోగులందరూ ఒక తాటిపైకి వచ్చి తమ డిమాండ్ల పరిష్కారానికి పోరు బాట చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు కార్మిక చట్టాలకు ఐటి రంగం మినహాయింపుగా వుంది. రోజుకు 14గంటలు పనిచేయాలనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో తమకు కూడా కార్మిక చట్టాలు కావాలని ఉద్యోగులు కోరుతున్నారు.
సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న సాహిల్ మాట్లాడుతూ కాగితంపై తన పనిగంటలు తొమ్మిదిగా వుంటుందని, కానీ దాదాపు 12 గంటలు పనిచేస్తానని చెప్పారు. ఇంటికి వచ్చినా కూడా బాస్‌లు ఫోన్ చేస్తూనే వుంటారని, మరింత పని అప్పగిస్తూనే వుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్‌టైమ్ పనిచేసినా దానికి చెల్లించేదేమీ వుండదన్నారు.
More Stories
ట్రంప్ టారిఫ్‌లను నిలిపివేయాలని కోర్టుకు 12 రాష్ట్రాలు
అమెజాన్, వాల్‌మార్ట్‌లపై ఆంక్షలు తొలగింపుకై వత్తిడి
జులైలో పట్టాలపైకి దేశంలో తొలి హైడ్రోజన్ రైలు