డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు

డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు

భారత్ డాలర్ ని బలహీనపరిచే ప్రయత్నాలు చేయలేదని, బ్రిక్స్ సభ్య దేశాల ఉమ్మడి కరెన్సీపై భారత్ ప్రమేయం లేదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టంగా వెల్లడించారు. అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలో భారతదేశం సమతుల్యతను పాటించే దౌత్య విధానాన్ని అనుసరిస్తోందని ఆయన తేల్చి చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో బ్రిక్స్ దేశాలు డాలర్‌ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తే వాణిజ్య సుంకాలను పెంచుతామని హెచ్చరించారు. దీనిపై భారత ప్రభుత్వ వైఖరి ఏమిటని పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానం ఇస్తూ బ్రిక్స్ రెండు దశాబ్దాలుగా ఆధారంగా సభ్యత్వం, ఎజెండా విస్తరిస్తున్న వేదిక. అంతర్జాతీయ సమాజంలో బ్రిక్స్ కార్యకలాపాలపై అవగాహన పెంచేలా భారత్ ప్రయత్నాలు ఉన్నాయని తెలిపారు. 

ఈ కూటమి తన సభ్యుల ఉమ్మడి ఆందోళనను ప్రతిబింబిస్తుందని,  ప్రపంచ దేశాలతో కలిసి ముందుకువెళ్తుందని, ప్రపంచ దేశాలతో కలిసి ముందుకు వెళ్లడమే లక్ష్యం అని వివరించారు.  డాలర్ బలహీనపరిచే ప్రయత్నాల్లో, బ్రిక్స్ కామన్ కరెన్సీని తీసుకురావడంలో భారత్ ప్రమేయం లేదని ట్రంప్ సుంకాల ముప్పు గురించి పర్లియామెంటులో అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానం ఇచ్చారు.

అలాగే, భారతదేశం ఇప్పటికే అమెరికాతో జరిపిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా డాలర్‌ బలహీనపరిచే ఎలాంటి ఉద్దేశం భారత్ కు లేదని స్పష్టంచేశారు. గతేడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఉమ్మడి కరెన్సీ ప్రస్తావన వచ్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ అంశంపై గట్టి ప్రస్తావన చేస్తూ,బ్రిక్స్ దేశాలు కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలని, డిజిటల్ కరెన్సీ వినియోగంపై భారత్‌తో కలిసి రష్యా పనిచేస్తోందని పేర్కొన్నారు.

అయితే, భారత ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలని పుతిన్ కోరారు. దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.  కాగా, అట్లాంటిక్ కౌన్సిల్‌కు చెందిన జియో ఎకనామిక్స్ సెంటర్ చేసిన అధ్యయనంలో,బ్రిక్స్ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా డాలర్‌పై ప్రపంచ దేశాలు ఆధారపడటం పూర్తిగా తగ్గించలేవని తేలింది.

గ్లోబల్ ట్రేడ్‌లో డాలర్‌కి ఉన్న గట్టి పట్టు కారణంగా, ఏదైనా కొత్త కరెన్సీని అంతర్జాతీయ స్థాయిలో తీసుకురావడం చాలా కష్టం అని స్పష్టం చేసింది.  బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీకిమద్దతు ఇస్తే, అమెరికా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. బ్రిక్స్ దేశాలు డాలర్‌ను అడ్డుకోవడానికి ప్రత్యామ్నాయ కరెన్సీ తీసుకువస్తే, వాటిపై 100 శాతం సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు.

భారతదేశం ఆర్థిక, వ్యూహాత్మక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని ప్రోత్సహించకుండా తటస్థ వైఖరిని పాటిస్తోంది. అయితే, అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించాలనే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ భవిష్యత్ విధానాలు ఏమిటనే అంశం ఆశక్తిగా మారింది.