బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్‌ఎస్‌ఎస్ పిలుపు

బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్‌ఎస్‌ఎస్ పిలుపు
బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలు రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల చేతుల్లో ఎదుర్కొంటున్న నిరంతర, ప్రణాళికాబద్ధమైన హింస, అన్యాయం, అణచివేతలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)  అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది స్పష్టంగా మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన కేసు అని బెంగుళూరులో జరుగుతున్న సమావేశాలలో రెండో రోజు ఆమోదించిన తీర్మానంలో స్పష్టం చేసింది. 
 
బంగ్లాదేశ్‌లో ఇటీవలి పాలన మార్పు సమయంలో, మఠాలు, దేవాలయాలు, దుర్గాపూజ మండపాలు, విద్యా సంస్థలపై దాడులు, దేవతలను అపవిత్రం చేయడం, అనాగరిక హత్యలు, ఆస్తులను దోచుకోవడం, మహిళలను అపహరించడం, వేధించడం, బలవంతంగా మతమార్పిడి చేయడం వంటి అనేక సంఘటనలు నిరంతరం జరుగుతూ ఉండటం పట్ల ఆర్ఎస్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది.
 
ఈ సంఘటనలను కేవలం రాజకీయ సంఘటనలు అని పేర్కొంటూ వాటి మతపరమైన కోణాన్ని తిరస్కరించడం సత్యాన్ని తిరస్కరించడమే అని స్పష్టం చేసింది. ఎందుకంటే ఇటువంటి సంఘటనల బాధితులు చాలా మంది హిందూవులు,  ఇతర మైనారిటీ వర్గాలకు చెందినవారని గుర్తు చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మతోన్మాద ఇస్లామిస్ట్ శక్తుల చేతుల్లో హింసకు గురవుతున్నారనేది కొత్తేమీ కాదని గుర్తుచేసింది.
 
బంగ్లాదేశ్‌లో హిందూ జనాభా నిరంతరం తగ్గడం (1951లో 22 శాతం నుండి నేడు 7.95 శాతానికి) వారి ఉనికి సంక్షోభాన్ని సూచిస్తుందని తెలిపింది. అయితే, గత సంవత్సరం జరిగిన హింస, ద్వేషానికి ప్రభుత్వ, సంస్థాగతమద్దతు తీవ్రమైన ఆందోళన కలిగిస్తుందని తెలిపింది. దీనితో పాటు, బంగ్లాదేశ్‌లో నిరంతర భారత్ వ్యతిరేక వాక్చాతుర్యం రెండు దేశాల మధ్య సంబంధాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. 
 
కొన్ని అంతర్జాతీయ శక్తులు భారత్ చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతంలో అస్థిరతను రేకెత్తించడానికి ఒక సంఘటిత ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొంటూ ఇది ఒక దేశాన్ని మరొక దేశానికి వ్యతిరేకంగా పోటీ చేసే అపనమ్మకం, ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తుందని వెల్లడించింది. అంతర్జాతీయ సంబంధాలలో ఆలోచనాపరులు, మేధావులు భారత్ వ్యతిరేక వాతావరణం, పాకిస్తాన్, డీప్ స్టేట్ కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండి వాటిని బహిర్గతం చేయాలని ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చింది.
 
మొత్తం ఈ ప్రాంతపు ఉమ్మడి సంస్కృతి, చరిత్ర, సామాజిక బంధాలను కలిగి ఉందనే వాస్తవాన్ని ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. దీని కారణంగా ఒకే చోట ఏదైనా తిరుగుబాటు ఈ ప్రాంతం అంతటా ఆందోళన కలిగిస్తుందని తెలిపింది. భారత్, పొరుగు దేశాల ఈ ఉమ్మడి వారసత్వాన్ని బలోపేతం చేయడానికి అప్రమత్తంగా ఉన్న ప్రజలందరూ ప్రయత్నాలు చేయాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. 
 
ఈ కాలంలో గమనించదగ్గ విషయం ఏమిటంటే, బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజం ఈ దురాగతాలను శాంతియుతంగా, సమిష్టిగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ధైర్యంగా ప్రతిఘతీస్తూ ఉండటం పట్ల ఆర్ఎస్ఎస్ హర్షం వ్యక్తం చేసింది. అలాగే, ఈ సంకల్పానికి భారతదేశంలోని హిందూ సమాజం నుండి, ప్రపంచవ్యాప్తంగా నైతిక, మానసిక మద్దతు లభించడం ప్రశంసనీయం అని తెలిపింది.
 
భారత్, వివిధ దేశాలలోని వివిధ హిందూ సంస్థలు ఈ హింసకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశాయని, ప్రదర్శనలు, పిటిషన్ల ద్వారా బంగ్లాదేశ్ హిందువుల భద్రత, గౌరవాన్ని డిమాండ్ చేశాయని గుర్తు చేసింది. అంతర్జాతీయ సమాజం నుండి అనేక మంది నాయకులు కూడా ఈ అంశాన్ని తమ స్థాయిలో లేవనెత్తారని తెలిపింది.
 
బంగ్లాదేశ్‌లోని హిందూవులు, ఇతర మైనారిటీ వర్గాలకు మద్దతుగా నిలబడాలని, వారి రక్షణ అవసరమని భారత ప్రభుత్వం తన సంకల్పాన్ని వ్యక్తం చేసిందని తెలిపింది. భారత ప్రభుత్వం ఈ అంశాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో పాటు అనేక ప్రపంచ వేదికలపై ప్రస్తావించిందని గుర్తు చేసింది. బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజపు రక్షణ, గౌరవం, శ్రేయస్సును నిర్ధారించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేయాలని, బంగ్లాదేశ్ ప్రభుత్వంతో నిరంతర, అర్థవంతమైన సమాలోచనలలో పాల్గొనాలని ఎబిపిఎస్ భారత ప్రభుత్వాన్ని కోరింది.
 
బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై జరుగుతున్న అమానవీయ ప్రవర్తనను తీవ్రంగా గమనించి, ఈ హింసాత్మక కార్యకలాపాలను నిలిపివేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితి, ప్రపంచ సమాజంపై ఉందని ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది.  బంగ్లాదేశ్‌లోని హిందూ, ఇతర మైనారిటీ వర్గాలకు సంఘీభావంగా తమ స్వరాన్ని వినిపించాలని వివిధ దేశాల నుండి హిందూ సమాజం, నాయకులు,  అంతర్జాతీయ సంస్థలకు ఎబిపిఎస్ లో ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చింది.