అంతరిక్షంలో భగవద్గీత, గణేశుడితో సునీత

అంతరిక్షంలో భగవద్గీత, గణేశుడితో సునీత
అంతరిక్షంలో తొమ్మిది నెలలపాటు ఉంది ఇటీవలనే భూమి పైకి తిరిగి వచ్చిన భారతీయ మూలాలు ఉన్న సునీత విల్లియమ్స్ పేరు ఇప్పుడు అంతటా ప్రతిధ్వనిస్తుంది. తొమ్మిది నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో పరిశోధనలు చేసి అంతరిక్షంలో అతి ఎక్కువ రోజులు ఉన్న వ్యోమగామిగా ఆమె చరిత్ర సృష్టించారు. 
 
కేవలం భారతీయ మూలాలు ఉండటమే కాకుండా సునీతకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పట్ల అమితమైన విశ్వాసం సహితం ఈ సందర్భంగా పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఆమె అంతరిక్షంలోకి తనతో పాటు భగవద్గీత, ఉపనిషత్తులతో పాటు గణేశుడి విగ్రహం కూడా తీసుకెళ్లింది. పైగా అక్కడే దీపావళి పండుగను కూడా జరుపుకుంది.

గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో ఆమె తన ఆధ్యాత్మిక జీవితంలో గణేశుడు ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తాడని ఆమె తెలపడం గమనార్హం. అంతరిక్షంలోకి ఒక హిందూ దేవుడి విగ్రహాన్ని తీసుకువెళ్లిన వ్యోమగామి సునీతే కావటం విశేషం.సునీత చాలాకాలంగా భారతీయ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కృషి, పట్టుదల ఉంటే ఎంతటి ఎత్తుకైన ఎదగవచ్చనటానికి ఆమెఒక ఉదాహరణ.

ఆమె 2013లో భారత దేశానికి చెందిన కొద్దిమంది పిల్లలతో మాట్లాడుతూ ‘‘ఈ ప్రపంచం మీకు ఆహ్వానం పలుకుతోంది. నేనూ మీలాంటిదానినే’’ అంటూ స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. అంతరిక్షంలో నివసించే వ్యోమగాములు తమకు నచ్చిన ఆహారాన్ని అంతరిక్షంలోకి పట్టుకువెళ్లవచ్చు. సునీత భారతదేశ ఆహార సంస్కృతికి గుర్తుగా సమోసాను అంతరిక్షంలోకి తీసుకువెళ్లారు. సునీతకు చిన్నప్పటి నుంచి భారతీయ ఆహారమంటే చాలా ఇష్టం. 

ఈ విషయాన్ని ఆమె అనేకసార్లు ఇంటర్వ్యూలలో కూడా పేర్కొన్నారు. సమోసా కేవలం ఆమెకు ఒక చిరుతిండి మాత్రమే కాదు, భారత దేశాన్ని ప్రతిరోజూ తలుచుకోవటానికి ఒక అవకాశం కూడా! సునీత తండ్రి భారత దేశం నుంచి అమెరికాకు వలస వెళ్లారు. అమెరికాలో కూడా భారతీయ పండుగలు జరుపుకుంటూ ఉండేవారు.

అంతరిక్షంలో వ్యోమగాములు తమకు నచ్చిన పండుగ జరుపుకొనే అవకాశముంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సునీత అంతరిక్షంలో దీపావళి జరుపుకున్నారు. ‘‘దీపావళి జరుపుకుంటుంటే నాన్నగారు గుర్తుకువస్తున్నారు’’ అన్న ఆమె మాటలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. అంతరిక్షానికి సునీత తనతో పాటుగా భగవద్గీత, ఉపనిషత్‌లను తీసుకుకెళ్లడంపై స్పందిస్తూ ‘‘నాకు మార్గదర్శకత్వం కావాల్సి వచ్చినప్పుడు, ఆత్మసైర్థ్యం కావాల్సినప్పుడు ఈ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే వీటిని అంతరిక్షంలోకి తీసుకు వెళ్తున్నాను’’ అని ఆమె పేర్కొన్నారు.

సునీతా విలియమ్స్  వయస్సు 59. తండ్రి భారతదేశంలోని గుజరాత్‌లో మెహ్సానా జిల్లాలోని ఝులసాన్ నివాసి. తండ్రి దీపక్ పాండే. తల్లి స్లోవేనియన్ ఉరుసిలాన్ బోని. భర్త మైఖేల్ విలియమ్స్ మాజీ ఫెడరల్ మార్షల్ గా ఉన్నారు. ఆమె అమెరికా నేవీలో అధికారిగా ప్రారంభించారు. 1998లో నాసాలో చేరారు. 

ఆమె మొదటి అంతరిక్ష ప్రయాణం డిసెంబర్ 2006లో స్పేస్ షటిల్ డిస్కవరీలో జరిగింది. రెండవ ప్రయాణం జూలై 2012లో జరిగింది. ఇప్పుడు మూడవ ప్రయాణం పూర్తయింది. ఆమె  మూడు అంతరిక్ష కార్యకలాపాలలో మొత్తం 62 గంటల ఆరు నిమిషాలు అంతరిక్షంలో నడిచారు. సునీత నాసా సొంత పెగ్గీ విట్సన్ నెలకొల్పిన రికార్డును అధిగమించారు. 

పెగ్గీ విట్సన్ రికార్డు 60 గంటల 21 నిమిషాలు. ఈసారి ఆమె ఐదు గంటల 26 నిమిషాలు గడిపిన తర్వాత కొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. 10 రోజుల మిషన్‌లో వచ్చిన సునీతకు అంతరిక్ష కేంద్రం కమాండ్ బాధ్యతలు అప్పగించారు. ఆమె 150కి పైగా ప్రయోగాలకు నాయకత్వం వహించారు. 

అంతరిక్షంలో మానవ శారీరక, మానసిక మార్పులు, సూక్ష్మజీవుల పెరుగుదల, ఉనికి, రోబోటిక్స్, మెటీరియల్ సైన్స్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. ప్లాంట్‌లో అతిపెద్ద నిర్వహణ పనులకు సునీత వ్యక్తిగతంగా నాయకత్వం వహించారు. ఒలింపిక్స్ సమయంలో స్టేషన్‌లో మినీ ఒలింపిక్స్ నిర్వహించబడిందని కూడా గుర్తించబడింది.