నాగ్‌పుర్‌ హింస వెనుక బంగ్లాదేశ్​ హస్తం?

నాగ్‌పుర్‌ హింస వెనుక బంగ్లాదేశ్​ హస్తం?
 
* ఆస్తి నష్టం మొత్తం నిందితుల నుండి వసూలు చేస్తాం!

నాగ్​పుర్​ హింస వెనుక బంగ్లాదేశీయుల హస్తం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా దీనిపై ఇప్పుడేమీ చెప్పలేమని  మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అయితే, దర్యాప్తు కొనసాగుతోందని, దీని వెనుక ఉన్నది ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాగ్‌పుర్‌లో నెలకొన్న హింసకు సంబంధించిన కారణాలపై మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రశేఖర్ సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో మార్చి 17న రెండు వర్గాల మధ్య చెలరేగిన హింసతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. నాగ్​పుర్హింసకు కారణమైన వారి నుంచే ఆస్తి నష్టం మొత్తాన్ని వసూలు చేస్తామని ముఖ్యమంత్రి ఫడణవీస్‌ స్పష్టం చేశారు. వారు డబ్బు చెల్లించని పక్షంలో వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, వాటిని విక్రయించి, బాధితులకు పరిహారం అందిస్తామని తేల్చి చెప్పారు. అవసరమైతే బుల్డోజర్లను కూడా ఉపయోగిస్తామని హెచ్చరించారు.

“మతపరమైన గ్రంథాలు, వస్తువులు దహనం చేసినట్లు కొంత మంది సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకూ 104 మందిని గుర్తించి, 92 మందిపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నాం. 92 మంది నిందితుల్లో 12 మంది మైనర్లు ఉన్నారు” అని తెలిపారు. 

“అల్లర్లకు పాల్పడిన వారు మహిళా కానిస్టేబుళ్లపై రాళ్ల దాడికి మాత్రమే పాల్పడ్డారు. లైంగిక వేధింపులకు దిగలేదు. పోలీసులపై దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాదు సోషల్‌ మీడియాలో తప్పుడు వదంతులు వ్యాప్తి చేసి, అల్లర్లకు కారణమైన వారిని కూడా నిందితులుగా పరిగణిస్తాం. ఇప్పటి వరకు 66 పోస్ట్‌లను తొలగించాం” అని దేవేంద్ర ఫడణవీస్‌ వెల్లడించారు.

మార్చి 17న నాగ్‌పుర్‌లో కొందరు మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. అనంతరం కొందరు ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేలా నినాదాలు చేయడంతో హింసాత్మకంగా మారింది. ఘర్షణలో 34 మంది పోలీసులు గాయపడ్డారని, ఇందులో ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ అల్లర్ల వెనుక బంగ్లాదేశీయుల హస్తం ఉండి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.