రాయ‌ల్ సొసైటీ ఫెల్లోగా డాక్ట‌ర్ సౌమ్య స్వామినాథ‌న్‌

రాయ‌ల్ సొసైటీ ఫెల్లోగా డాక్ట‌ర్ సౌమ్య స్వామినాథ‌న్‌
భార‌త ర‌త్న ఎంఎస్ స్వామినాథ‌న్ అడుగుజాడ‌ల్లోనే ఆయ‌న కూతురు సౌమ్య స్వామినాథ‌న్ బ్రిట‌న్‌కు చెందిన ద రాయ‌ల్ సొసైటీలో అత్యంత అరుదైన గౌర‌వం పొందారు. ఫెల్లో ఇన్ రాయ‌ల్ సొసైటీగా సౌమ్య స్వామినాథ‌న్ ఎంపిక‌య్యారు. రాయ‌ల్ సొసైటీ ప్ర‌పంచంలోనే పురాతనమైన సైంటిఫిక్ అకాడ‌మీ. అత్యంత ప్ర‌తిభావంతులైన సైంటిస్టుల‌కు మాత్ర‌మే ఆ సొసైటీలో ఫెల్లోగా ఎంపిక‌య్యే అవ‌కాశం ద‌క్కుతుంది. 
 
రాయ‌ల్ సొసైటీలో సౌమ్య తండ్రి ఎంఎస్ స్వామినాథ‌న్ కూడా ఫెలోషిప్ అర్హ‌త సాధించారు. ఐజాక్ న్యూట‌న్ లాంటి శాస్త్ర‌వేత్త‌లు ఉన్న రాయ‌ల్ సొసైటీ లీగ్‌లో సౌమ్య చేరారు. ఆమె ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్తగా, భారత వైద్య పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. రాయ‌ల్ సొసైటీ ఫెలోషిప్‌కు సౌమ్య ఎంపికైన విష‌యాన్ని సీఎస్ఐఆర్ మాజీ అధ్య‌క్షుడు ర‌ఘునాత్ మ‌స్లేక‌ర్ ప్ర‌క‌టించారు. శాస్త్ర‌వేత్త‌ల‌కు ల‌భించే అత్యంత ఉన్నత గౌర‌వం ఇదే అని ఆయ‌న పేర్కొన్నారు. 
భార‌త్‌కు చెందిన తండ్రీకూతుళ్లు రాయ‌ల్ సొసైటీ ఫెలోషిప్ సాధించ‌డం ఇదే మొద‌టిసారి అని ఆయన తెలిపారు.  రాయ‌ల్ సొసైటీని 1660లో స్థాపించారు. శాస్త్ర‌వేత్త‌ల‌ను గుర్తించ‌డం, సైన్స్‌ను ప్ర‌మోట్ చేయ‌డం, ఆ రంగంలోని నిష్ణాతుల‌ను గౌర‌వించ‌డం లాంటి కార్య‌క్ర‌మాల‌ను రాయ‌ల్ సొసైటీ చేస్తోంది. మాన‌వాళికి ఉప‌యోగప‌డే సైన్సును వృద్ధి చేస్తోంది.  సుమారు 400 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన ఆ సొసైటీలో అర్హ‌త సాధించిన భార‌తీయ రెండో మ‌హిళా శాస్త్ర‌వేత్త‌గా సౌమ్యా స్వామినాథ‌న్ నిలిచారు.
ఎఫ్ఆర్ఎస్ పొందిన తొలి మ‌హిళా శాస్త్ర‌వేత్త‌గా ప్రొఫెస‌ర్ గ‌గ‌న్‌దీప్ కంగ్‌కు ఉంది. 2019లో ఆమె ఆ సొసైటీకి ఎంపిక‌య్యారు.  ప్ర‌ఖ్యాత సైంటిస్టులు, ఇంజినీర్లు, టెక్నాల‌జిస్టుల‌కు రాయ‌ల్ సొసైటీలో ఫెలోషిప్ క‌ల్పిస్తారు.  సైన్స్‌లో సాధించిన ఘ‌న‌త‌ల ఆధారంగా శాస్త్ర‌వేత్త‌ల‌కు గుర్తింపు ఇస్తుంటారు. ప్ర‌స్తుతం రాయ‌ల్ సొసైటీలో సుమారు 1900 మంది ఫెల్లోస్ ఉన్నారు. దాంట్లో 85 మంది నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత‌లు ఉన్నారు.