100 కోట్ల టన్నులు దాటిన బొగ్గు ఉత్పత్తి

100 కోట్ల టన్నులు దాటిన బొగ్గు ఉత్పత్తి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిలో 100 కోట్ల టన్నుల మైలురాయిని భారత్ దాటింది. ఇది దేశానికి గర్వ కారణమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇంధన శక్తి భద్రత, స్వావలంబన విషయంలో దేశం నిబద్ధతకు ఇది సూచిక అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

విద్యుత్ ఉత్పత్తిలోను, పలు పరిశ్రమల్లో ఇంధనంగా ప్రధానంగా ఉపయోగిస్తుండే బొగ్గు ప్రపంచ ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఇంధన వనరుగా ఉంటున్నది. భారత్ 202324 (2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు) 997.83 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. “ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల టన్నుల మేరకు బొగ్గు ఉత్పత్తి చేయడం భారత్‌కు గర్వకారణం” అని ప్రధాని మోదీ  సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ పోస్ట్‌లో అభివర్ణించారు.

“100 కోట్ల టన్నుల మైలురాయిని దాటడం గణనీయమైన విజయం. ఇంధన శక్తి భద్రత, ఆర్థిక వృద్ధి, స్వావలంబన పట్ల మన నిబద్ధతకుఇది ప్రతీక” అని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంతో సంబంధం ఉన్న వారందరి అంకితభావాన్ని, గట్టి కృషిని ఇది ప్రతిబింబిస్తోందని ప్రధాని తెలిపారు. ఈ విజయం గురించి ప్రకటనతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సామాజిక మాధ్యమంలో చేసిన పోస్ట్‌పై ప్రధాని మోదీ ఈ వ్యాఖ్య చేశారు.

అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమర్థ విధానాలతో భారత్ ఉత్పత్తిని హెచ్చించడమే కాకుండా సుస్థిర, బాధ్యతాయుత గనుల తవ్వకం జరిగేలా చూసిందని మంత్రి తెలిపారు.”విజయం పెరుగుతున్న మన విద్యుత్ డిమాండ్లను తీరుస్తుంది, ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది, ప్రతి భారతీయునికి సముజ్వల భవిష్యత్తును సాధ్యం చేస్తుంది” అని కిషన్ రెడ్డి సూచించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారత్ ప్రపంచ ఇంధన శక్తిలో అగ్రగామి దిశగా పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మైలురాయి సాధనలో బొగ్గు రంగంలో శ్రామిక శక్తి కృషిని కూడా కిషన్ రెడ్డి శ్లాఘించారు. 202425 ఆర్థిక సంవత్సరానికి బొగ్గు మంత్రిత్వశాఖ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 108 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం.