
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తోన్న అనిశ్చితి ఆర్ధిక విధానాలు, టారీఫ్‌ల పెంపు ప్రపంచ దేశాల వృద్ధి రేటును దెబ్బతీస్తున్నాయని ప్రముఖ రేటింగ్ ఎజెన్సీ ఫిచ్ వెల్లడించింది. అమెరికా వాణిజ్య యుద్ధంతో 2025లో ప్రపంచ వృద్ధి రేటు 2.3 శాతానికి పడిపోనుందని విశ్లేషించింది. ఇంతక్రితం ఏడాదితో పోల్చితే 0.3 శాతం తగ్గనుందని అంచనా వేసింది.
యూరప్ సహా ఇతర దేశాలపై యుఎస్ వేస్తోన్న సుంకాలు దెబ్బకొస్తున్నాయని తెలిపింది. 2026లో గ్లోబల్ వృద్ధి మరింత తగ్గి 2.2 శాతానికి పరిమితం కావొచ్చని హెచ్చరించింది. ఈ ఏడాది అమెరికా జిడిపి రేటుకు 1.1 శాతం కోత పెట్టి.. 1.7 శాతానికి పరిమితం చేసింది. 2024లో 2.8 శాతం వృద్ధిని నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేసింది.
చైనా, యూరోపియన్ యూనియన్ దేశాల వృద్ధి తగ్గనుందని ఫిచ్ పేర్కొంది. అయితే జపాన్ మాత్రం 2024లో 0.1 శాతం వృద్ధిని నమోదు చేయగా 2025లో 1.1 శాతం వృద్ధి సాధించనుందని తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత 2024-25లో 6.3 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. 2025-26లో 6.5 శాతానికి తగ్గొచ్చని విశ్లేషించింది.
ఇది ఆర్‌బిఐ అంచనా 6.7 శాతం కంటే తక్కువ కావడం గమనార్హం. అమెరికా వాణిజ్య విధానాలు ప్రధాన సవాళ్లుగా నిలువనున్నాయని పేర్కొంది. వినియోగదారుల విశ్వాసం తగ్గిందని పేర్కొంది. దీంతో వాహన అమ్మకాల్లో తగ్గుదల చోటు చేసుకుంటున్న విషయాన్ని ఫిచ్ గుర్తు చేసింది.
2024-25లో భారత జిడిపి 6.4 శాతానికి పరిమితం కావొచ్చని ఇటీవల ఎన్‌ఎస్‌ఒ అంచనా వేసింది. ఇది నాలుగేళ్లలోనే అత్యంత కనిష్ట స్థాయి. ఇంతక్రితం 2023-24లో జిడిపి 8.2 శాతం పెరిగింది. 2024-25లో 6.6 శాతం వృద్ధి ఉండొచ్చని ఆర్‌బిఐ ఇటీవల అంచనా వేసింది. దీంతో పోల్చితే ఫిచ్ తాజా అంచనాలు మరింత ఆందోళన కలిగించే అంశం.
More Stories
పాక్ గగనతలాన్ని మూసేయడంతో డీజీసీఏ సూచనలు
ట్రంప్ టారిఫ్లను నిలిపివేయాలని కోర్టుకు 12 రాష్ట్రాలు
అమెజాన్, వాల్మార్ట్లపై ఆంక్షలు తొలగింపుకై వత్తిడి