అసెంబ్లీకి దొంగల్లా వచ్చి వెళ్లడం ఏంటి?

అసెంబ్లీకి దొంగల్లా వచ్చి వెళ్లడం ఏంటి?

ఏపీ అసెంబ్లీలో సభ్యుల హాజరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ సభ్యుల తీరుపై అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ సభ్యులు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారంటూ మండిపడ్డారు. సమావేశంలో 25 ప్రశ్నలకు సమాధానాలు రాలేదని పేర్కొన్నారు. 

ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు రాయడం వల్ల మెంబర్లు వాటిని అడగడానికి ఇబ్బంది వస్తోందని చెప్పారు. ఇది సమంజసం కాదన్న స్పీకర్ ప్రశ్నలు అడగడానికి వారు సభలో ఉండడం లేదని, ఇది చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ సభ్యులు సభకు రావాలని, ఎన్నికైన సభ్యులు సగౌరవంగా సభకు రావాలని సూచించారు.

ఎవరికీ కనిపించకుండా ఆ సభ్యులు వచ్చి దొంగల్లా సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ప్రజలు సభ్యులుగా ఎన్నుకుంటే ఎందుకు ముఖం చాటేస్తున్నారని ఆయన నిలదీశారు. దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. హాజరు పట్టికలో సంతకాలు చేసి సభకు రాకపోవడం వారి గౌరవాన్ని పెంచదని స్పష్టం చేశారు. 

వై బాల నాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాధ రెడ్డి, విశ్వేశరరాజులు ఇలా సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని తెలిపారు. గవర్నర్ ప్రసంగం తర్వాత వేర్వేరు రోజుల్లో వీరు సంతకాలు చేసి వెళ్లినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దని అయ్యన్నపాత్రుడు హితవుపలికారు.

“వైఎస్సార్సీపీ సభ్యులు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు. సమావేశంలో 25 ప్రశ్నలకు సభలో సమాధానాలు రాలేదు. ప్రశ్నలు అడగడానికి వారు సభలో ఉండట్లేదు ఇది చాలా దురదృష్టకరం. ప్రజలు ఎన్నుకుంటే ఎందుకు ముఖం చాటేస్తున్నారు. దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లడమేంటి. గవర్నర్ ప్రసంగం తరువాత వేర్వేరు రోజుల్లో సంతకాలు చేసి వెళ్లినట్టు తెలుస్తోంది. ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దు” అంటూ స్పీకర్ హితవు చెప్పారు.