
అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూస్తే హామీల ఎగవేతల బడ్జెట్ లా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇది మొండి చేయి ఇచ్చే బడ్జెట్, గొప్పలు చెప్పుకొనే బడ్జెట్ అని పేర్కొంటూ కేవలం రూ. 36 వేల కోట్లతో అభివృద్ధి ఎలా సాధ్యమో భట్టి విక్రమార్క చెప్పాలని ప్రశ్నించారు.
ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేలా బడ్జెట్ ను పెట్టారని ఆయన మండిపడ్డారు. ఆదాయం చరానా.. అప్పు బరానా అన్నట్లు ఉందని చెబుతూ బడ్జెట్ నిండా అప్పులే ఉన్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులు మరింత పెరిగే సూచికగా ఉందని చెబుతూ ఇన్ని రకాలుగా అప్పులు చేసినా ఏం అభివృద్ధి చేశారని ఆయన నిలదీశారు.
ఈ సారి కూడా నిరుద్యోగులకు మొండి చేయి చూపిస్తారని అర్థం అయ్యిందని, మహిళలకు ఇస్తామన్న హామీలు ఎందుకు పొందుపరచలేదో చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు భరోసాకి నిధులు ఏ రకంగా సరిపోతాయనేది చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలకు బడ్జెట్ కేటాయించకపోవడం బాధకరమని చెప్పారు. రై
తులను మోసం చేసేలా ఉంది ఈ బడ్జెట్ అని పేర్కొంటూ రైతులకు ఇచ్చిన హామీలకు రూ. 42 వేల కోట్లు అవసరం కాగా అది ఎక్కడా బడ్జెట్ లో పెట్టకపోవడం చూస్తే మరోసారి రైతులను మోసం చేయబోతున్నారని అర్థం అవుతుందని బిజెపి నేత విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ ప్రకారం బడ్జెట్ ప్రవేశ పెట్టకపోవడం ఎలా? అని ప్రశ్నించారు.
మైనారిటీలతో పోల్చుకుంటే రూ. 16 వేల కోట్లు బీసీలకు ఇవ్వాల్సి వస్తుందని, కానీ, రూ. 11 వేల కోట్లు మాత్రమే కేటాయించారంటే మైనారిటీలపై ఉన్న ప్రేమ బీసీల మీద లేదా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. హామీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలని ఆయన మండిపడ్డారు.
కాగా, ఇందిరమ్మ రాజ్యం పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ రాష్ట్రంలో ఏ వర్గాన్నీ సంతృప్తిపరచలేదని, పూర్తిగా మోసపూరితంగా ఉందని బిజెపి ఆదిలాబాద్ ఎమ్యెల్యే, శాసనసభా పార్టీ ఉపనాయకుడు పాయల్ శంకర్ విమర్శించారు. 6 గ్యారంటీలను తుంగలో తొక్కిన బడ్జెట్ తో కాంగ్రెస్ మోసం బయటపడిందని ధ్వజమెత్తారు.
వృద్ధుల పట్ల ఘోరమైన అన్యాయం చేసిందని చెబుతూ పెన్షన్ ఒక్క రూపాయి కూడా పెంచలేదని, ఇప్పుడు కొత్తగా పెన్షన్లకు కూడా స్థానం కల్పించలేదని మండిపడ్డారు. ఐదేళ్లలో బీసీల సంక్షేమం కోసం సంవత్సరానికి రూ. 20 వేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలలో రూ. లక్ష కోట్లు ఖర్చుపెడతామని చెప్పారని ఆయన గుర్తు చేశారు.
అయితే, బీసీ సబ్ ప్లాన్ నిధుల కింద గత సంవత్సరం బడ్జెట్ కేటాయించారని, కాని నయా పైసా ఖర్చు చేయలేదని, ఈ బడ్జెట్ లో బీసీ సబ్ ప్లాన్ పదాన్నే ఉచ్ఛరించలేదని శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కింద రూ.19 వేల కోట్లు బకాయిలు ఉన్నా 2025-26 బడ్జెట్ లో కొత్తగా నిధులు కేటాయించలేదని, పైగా రుణమాఫీ కోసం కూడా నిధులు కేటాయించలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
ఏపీ పట్టణాల్లో స్లీపర్‌సెల్స్ పై పోలీసుల డేగకన్ను