
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించేందుకు అనుమతించనున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై ఆదివారం, సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయని టీటీడీ వెల్లడించింది. బుధవారం, గురువారం ప్రత్యేక ప్రవేశ దర్శనాలు(రూ.300) ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. నిర్దేశిత రోజుల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించి ఒక లేఖ మాత్రమే స్వీకరిస్తామని వెల్లడించింది.
మార్చి 24 నుంచి అమలు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఒకరికి ఒక సిఫార్సు లేఖను మాత్రమే 6 మందికి మించకుండా స్వీకరించడం జరుగుతుందని టీటీడీ వెల్లడించింది. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలను, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టీటీడీ వెల్లడించింది.
టీటీడీ తాజా ఉత్తర్వులపై ఏపీ సీఎం చంద్రబాబుకి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదించాలని గతంలో ఆమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి లేఖ రాశారు. లేఖపై స్పందించి నిర్ణయం తీసుకున్నందుకు ఆమె హర్షం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల దర్శన విధానంలో మార్పులు చేశారు. ఇప్పటి వరకు సోమవారం ఏపీ ప్రజాప్రతినిధుల దర్శనానికి అనుమతి ఉండేది. కానీ, కొత్త మార్పుల ప్రకారం ఇకపై ఆదివారం దర్శనం కోసం, శనివారం సిఫార్సు లేఖలు స్వీకరించనుంది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
More Stories
అమరావతి పర్యటనలో ప్రధాని మోదీ రోడ్ షో రద్దు
ఏపీ పట్టణాల్లో స్లీపర్సెల్స్ పై పోలీసుల డేగకన్ను
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలు