
ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సోమవారం సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికను ఆమోదించారు. దీనిని ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టనున్నారు.
అనంతరం, దీనిపై ప్రత్యేక చర్చను చేపట్టి సభ ఆమోదం తీసుకు, ఆ వెంటనే కేంద్రానికి పంపించనున్నారు. కాగా, ఏకసభ్య కమిషన్ రాష్ట్రంలోని ఎస్సీలను గ్రూప్-1, 2, 3లుగా విభజించింది. గత ఏడాది నవంబరు 15న నియమించిన ఏకసభ్య కమిషన్ ఎస్సీల్లో ఏయే వర్గాలు ప్రభుత్వ ప్రయోజనాలను సమానంగా పొందలేక పోయాయన్న విషయంపై కమిషన్ దృష్టి సారించింది.
అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించి, ఎస్సీ ఉపకులాల జనాభాపై కూడా దృష్టి పెట్టింది. 2024 జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఆ గణాంకాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఎస్సీల్లో ఆయా వర్గాలు ప్రభుత్వ రంగంలో అవకాశాలు పొందలేకపోవడంపై దృష్టి పెట్టింది. ఎస్సీల్లో మాదిగలు ప్రభుత్వ ఉద్యోగాల్లో అతి తక్కువ భాగస్వామ్యం కలిగి ఉన్నారని గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా ఉద్యోగాల్లో ఎస్సీల్లోని ఏ ఉపకులం వారు ఎంతమంది ఉన్నారన్న గణాంకాలు తెలుసుకుంది.
గత ఏడాది నవంబరు 7న సచివాలయంలో 23 మంది కూటమి దళిత ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతోపాటు ఎన్నికల హామీపై కూడా వారితో చర్చించారు. జనాభా దామాషా పద్ధతిలో జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు.
అంతకు ముందే కూటమి దళిత ఎమ్మెల్యేలు సమావేశమై దళితుల సమస్యలను చర్చించారు. టీడీపీ మేనిఫెస్టోలో ఎస్సీ రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన చేపడతామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా స్థాయిలో జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ ఏ, బీ, సీ, డీలుగా కాకుండా ఏ, బీ, సీలు వర్గీకరించాలని సూచించారు.
గత ప్రభుత్వం కూడా కార్పొరేషన్లను మూడు కులాలకు మాత్రమే ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మాదిగ, మాల, రెల్లి, ఇతర వర్గాలుగా విభజించాలని కోరారు. ఎస్సీ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్లను 16 నుంచి 18 శాతానికి పెంచాలని ఎమ్మెల్యేలు కోరారు.
కాగా, చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పవర్‌లూం యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని నిర్ణయించింది. వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ, వైఎస్సార్ తాడిగడప పేరులో వైఎస్సార్ తొలగించి తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
More Stories
కాకినాడ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులు
టిటిడిలో వేయి మందికి పైగా అన్యమతస్థులు
అధిక పొగ వాహనాలకు తిరుమలలో ప్రవేశం లేదు