ఎబిఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం చిత్తూర్ జిల్లా వి.కోటలో వాకింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి జర్నలిస్టు జగన్‌ను కత్తులతో నరికి చంపారు. ఆపై అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డితోపాటు నడుస్తున్న మణి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు పాల్పడింది రౌడీ షీటర్ తమీమ్‌గా గుర్తించారు. తమీమ్‌కు మరో వ్యక్తి సాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. తమీమ్‌ది వి.కోట అయినప్పటికీ ప్రస్తుతం కర్నాటకలో నివాసం ఉంటున్నాడు.
జర్నలిస్టుపై పట్టపగలే జరిగిన ఈ దాడితో పాత్రికేయ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి కి చెందిన సీనియర్ జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డిని దుండగులు హత్య చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ లు తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపాయి. జర్నలిస్టు హత్య పై రాష్ట్రంలోని జర్నలిస్టులంతా తమ నిరసనను వ్యక్తం చేయాలని పిలుపునిచ్చాయి. ఆంధ్రజ్యోతి విలేకరి హత్యకు పాల్పడిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

More Stories
విశాఖలో ‘గూగుల్ ఏఐ డేటా సెంటర్’కు శంకుస్థాపన
ఆంధ్రా యూనివర్సిటీ గ్లోబల్ యూనివర్సిటీగా ఎదగాలి
పాస్టర్ ఆనంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం రద్దు