పోలవరంలో వేగం కనిపించని పనులు, నిధుల వ్యయంలో జాప్యం!

పోలవరంలో వేగం కనిపించని పనులు, నిధుల వ్యయంలో జాప్యం!
 
* భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల్లో వెనుకబడ్డారని కేంద్రం విచారం 
 
పోలవరం ప్రాజెక్టు  తొలిదశలో భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల్లో వెనుకబడ్డారని  కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్‌ కాంతారావు విచారం వ్యక్తం చేశారు. నిధులున్నా వ్యయం చేయకపోవడంపై పెదవి విరిచారు. నెలకు రూ.500 కోట్లయినా ఖర్చు చేయలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు.  శుక్రవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో ఆయన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), వాప్కోస్‌, సెంట్రల్‌ వాటర్‌-పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూఎంఆర్‌ఎస్‌), కేంద్ర జల సంఘం, కేంద్రపర్యావరణం-అటవీశాఖ, కేంద్ర భూసేకరణ, సహాయపునరావాస శాఖ, సీఎ్‌సఎంఆర్‌ఎస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 
 
అయితే, భూసేకరణ దాదాపు పూర్తయిందని, గిరిజన ప్రాంతాల్లో పునరావాస కాలనీల నిర్మాణం, నిర్వాసితుల తరలింపు కొంత నెమ్మదిగా సాగుతున్నాయని  పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కమిషనర్‌ ప్రశాంతి చెప్పారు. భూసేకరణ, సహాయ పునరావాస పనుల ప్రగతిని ఇకపై పీపీఏ, వాప్కోస్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని కాంతారావు ఆదేశించారు.

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా జిలెటిన్‌ స్టిక్స్‌ దిగుమతి నిలిచిపోయిందని సాయిప్రసాద్‌ తెలిపారు. డీజిల్‌ కొరత సమస్య ప్రాజెక్టుపై పడిందని తెలిపారు.
రోజూ బల్క్‌లో 50,000 లీటర్ల డీజిల్‌ అవసరం కాగా, రెండు వారాలుగా ఏడెనిమిది వేల లీటర్లలోపే అందుతోందని చెప్పారు. డీజిల్‌, జిలెటిన్‌ స్టిక్స్‌ వంటి సమస్యలు ఎదురైనప్పుడు తక్షణం తమదృష్టికి తీసుకురాకపోతే, అవి పరిష్కారమెలా అవుతాయని కాంతారావు ప్రశ్నించారు. బల్క్‌ డీజిల్‌పై ఏలూరు కలెక్టరుతో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు. జిలెటిన్‌ స్టిక్స్‌ దిగుమతిపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని పీపీఏని ఆదేశించారు.
 
తొలి దశ పనులు 2027 జూన్‌ నాటికి పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకు తగు సహకారం అందించాలని కాంతారావు ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తికి నిధుల కొరత ఉండదని, ఇప్పటికే అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,800 కోట్లలో 75 శాతం ఖర్చుపెడితే మరో 3,300 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.  సీఎస్ఎంఆర్‌ఎస్‌ అధికారులు నెలలో రెండు సార్లయినా ప్రాజెక్టును సందర్శించాలని స్పష్టం చేశారు. ముంపు సమస్యపై ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణ అభ్యంతరాల పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకుంటుందని పేర్కొంటూ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. 
 
నెలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని జలశక్తి అధికారులు సూచించినట్లు తెలిసింది. కీలకమైన డయాఫ్రం వాల్‌ పూర్తయిందని, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం పనుల్లో వేగం కనిపిస్తోందంటూ కాంతారావు సంతృప్తి వ్యక్తం చేశారు.  జలవనరుల బాధ్యతలు కూడా చూస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, పీపీఏ సీఈ రమేశ్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు.