ఔరంగజేబ్ సమాధి అంశంపై మహారాష్ట్రలో వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో నాగ్‌పుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం రాత్రి 8 నుంచి 8.30 నిమిషాల మధ్య కొన్ని చోట్ల ఘర్షణాత్మాక వాతావరణం నెలకొన్నది. దీంతో వీటిని అదుపు చేసేందుకు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది అధికార యంత్రాంగం. ఈ మేరకు స్థానిక పోలీస్ కమిషనర్ రవీందర్‌కుమార్ సింగల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.
నాగ్‌పుర్ నగర పరిధిలోని కొత్వాలి, గణేశ్‌పేట్, లకడ్‌గంజ్, పచ్పావులి, శాంతినగర్, సక్కర్‌దర, నందన్‌వన్, ఇమామ్వాడ, యశోధర నగర్, కపిల్‌నగర్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించారు. ఎవరైనా కర్ఫ్యూ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
నాగ్‌పుర్‌లో నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ప్రజలంతా శాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వదంతలను నమ్మకుండా, అధికార యంత్రాంగానికి సహకరించాలని చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం నగరంలోని మహల్ ప్రాంతంలోగల శివాజీ మహరాజ్ విగ్రహం వద్ద విశ్వ హిందూ పరిషత్, బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఔరంగజేబు ఫొటో, సమాధి నమూనాకు నిప్పు పెట్టారు.
దీనికి ప్రతిగా మరికొందరు నిరసనకు దిగారు. పోలీసులపై, వారి వాహనాలపై రాళ్లు రువ్వారు. ఓ వాహనానికి నిప్పు పెట్టారు. లాఠీచార్జి, భాష్పవాయువు ప్రయోగించి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ హింసాత్మక ఘటనలో పలువురికి గాయాలయ్యాయని పేర్కొన్నారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. ఘటనపై ముఖ్యమంత్రి కూడా దృష్టిసారించారని, ఈ నేపథ్యంలో ఎటువంటి వదంతులను నమ్మొద్దని కోరారు.
‘‘మహల్ ఏరియాలో రాళ్లు రువ్విన ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే, పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. నాగ్‌పూర్ ప్రశాంతమైన నగరమని, స్థానికులు ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలు పంచుకుంటారని పేర్కొంటూ నాగ్‌పూర్ సంస్కృతి ఇదేనని, ప్రజలు వదంతులను నమ్మొద్దని సూచించారు.
‘‘కొందరు రాళ్లు రువ్వారు. కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో మేము కూడా తగు చర్యలు తీసుకున్నాము. భాష్ఫ వాయువు ప్రయోగించాము. అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి మంటలను ఆర్పాము. ఈ ఘటనలో కొందరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. నా కాలికీ రాయి తగిలి గాయం అయ్యింది. హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని నాగ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు
హింసకు దిగిన వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. కూంబింగ్ ఆపరేషన్ ద్వారా నిందితుల్ని గుర్తిస్తున్నారు. నగరంలో 144 సెక్షన్ అమలు చేశామన్నారు. జనం గుమ్మికూడడంపై ఆంక్షలు విధించారు. అనవసరంగా ఇంటి బయటకు రావొద్దు అని కోరారు. వదంతులను వ్యాపించడం కానీ నమ్మడం కానీ చేయవద్దని చెప్పారు.
ప్రభావిత ప్రాంతం మినహా.. నగరంలోని మిగితా ప్రాంతాలన్నీ శాంతియుతంగా ఉన్నట్లు పోలీసు కమీషనర్ సింఘాల్ తెలిపారు. హింసకు దిగిన వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. కూంబింగ్ ఆపరేషన్ ద్వారా నిందితుల్ని గుర్తిస్తున్నారు. నగరంలో 144 సెక్షన్ అమలు చేశామన్నారు. జనం గుమ్మికూడడంపై ఆంక్షలు విధించారు. అనవసరంగా ఇంటి బయటకు రావొద్దు అని కోరారు.
సోమవారం రాత్రి జరిపిన కూంబింగ్ ఆపరేషన్‌లో 80 మందిని అరెస్టు చేశారు. మహల్ ఏరియాలో భారీగా పోలీసుల్ని మోహరించారు. 55 సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా పెట్టారు. నగరంలో 163 సెక్షన్ అమలు చేస్తున్నారు.
More Stories
కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!