బంగారు లక్ష్మణ్ కు ఘనంగా నివాళులు

బంగారు లక్ష్మణ్ కు ఘనంగా నివాళులు
భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ 86వ జయంతి సందర్భంగా ఆయనకు సోమవారం తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, సేవలను స్మరించుకున్నారు. 

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్సులు బంగారు శృతి, చంద్రశేఖర్ తివారీ, బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, శివాజీ, మొగిలయ్య , అశోక్, క్రాంతికిరణ్ తదితరులు పాల్గొని లక్ష్మణ్ సేవలను కొనియాడారు.

ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ బంగారు లక్ష్మణ్ సతీమణితో పాటు ఆయన కుమార్తె బంగారు శృతి పార్టీ తరఫున ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తున్నారని చెప్పారు. మండల, రాష్ట్ర స్థాయిలో ఆ మహనీయుడి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. బంగారు లక్ష్మణ్ గారి సేవలను మనందరం గుర్తుచేసుకొని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని పిలుపునిచ్చారు.

“బంగారు లక్ష్మణ్ సామాన్య కుటుంబంలో జన్మించి, అసామాన్య నాయకుడిగా ఎదిగి దేశ స్థాయిలో అనేక కీలక పదవులు నిర్వహించారు. ఆయన సేవలు ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి మార్గదర్శకంగా నిలిచాయి. ఆయన ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత” అని కొండేటి శ్రీధర్ పేర్కొన్నారు.

బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్ మాట్లాడుతూ నాగపూర్ లో వాజ్ పేయి  అధ్యక్షతన సమావేశం జరిగినప్పుడు మన దేశంలో అణగారిన వర్గాలకు సంబంధించిన సమస్యలు ఆ వేదికగా బంగారు లక్ష్మణ్ అనర్గళంగా వివరించారని గుర్తు చేశారు. బంగారు లక్ష్మణ్ ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక చర్చను ప్రారంభించి, ముసాయిదా తీర్మానాన్ని సిద్ధం చేయించారని చెప్పారు.

ఆయన ప్రతిపాదనలు ‘నాగపూర్ డిక్లరేషన్’ రూపంలో ఆమోదించామని పేర్కొంటూ ఏ పదవిలో ఉన్నా, పార్టీకి విశేషమైన సేవలు అందించారని తెలిపారు. ఆయన సిద్ధాంతాలు ఇప్పటికీ బిజెపి కార్యకర్తలకు స్ఫూర్తినిస్తాయని స్పష్టం చేశారు. ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, రాష్ట్ర ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా అంచలెంచలుగా ఎదిగి, ఏ పదవి చేపట్టినా ఆ పదవులకు వన్నె తీసుకొచ్చారని కొనియాడారు. 

నిత్యం అణగారిన వర్గాల కోసం ఆలోచించిన వ్యక్తి బంగారు లక్ష్మణ్ అంటూ పార్టీ పట్ల క్రమశిక్షణగా ఉంటూ, రాజ్యసభకు ఎన్నికయ్యారని, రైల్వేశాఖకు సహాయ మంత్రిగా విధులు నిర్వహించారని గుర్తు చేశారు.  ఏ బాధ్యత నిర్వహించినా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారని, బంగారు లక్ష్మణ్  ఆలోచన విధానాలు ఇప్పటికీ మన అందరికీ స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు. బంగారు లక్ష్మణ్ ఆశయాలను కొనసాగించడమే బిజెపి కార్యకర్తలుగా, ఎస్సీ మోర్చా కార్యకర్తలుగా మనందరి కర్తవ్యమని పిలుపిచ్చారు.

సీనియర్ నేత చింతా సాంబమూర్తి గారు మాట్లాడుతూ బంగారు లక్ష్మణ్ దేశ రాజకీయాల్లో ప్రత్యేకస్థానం సంపాదించారని, ప్రజాస్వామ్య విలువల కోసం రాజీలేని పోరాటం చేశారని తెలిపారు.  బంగారు లక్ష్మణ్  రాజకీయ నేపథ్యం సామాన్య కుటుంబం నుంచి వచ్చి, అసామాన్య నాయకుడిగా ఎదిగారని చెప్పారు. ఆయన నిరంతర పరిశ్రమ, కఠోర దీక్ష, అచంచల దేశభక్తే ఆయన ఉన్నత నాయకుడిగా ఎదగడానికి కారణమయ్యాయని వివరించారు.

ఆయన రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమైనదిని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవడం ద్వారా నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. బంగారు లక్ష్మణ్ జాతీయ అధ్యక్షుడు అయినప్పుడు దేశ, విదేశాల నుంచి 16 మంది ప్రతినిధులు వచ్చి, భారతదేశంలో బిజెపి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అభినందించారని తెలిపారు.