దళారుల చేతుల్లో మోసపోతున్న తిరుమల భక్తులు

దళారుల చేతుల్లో మోసపోతున్న తిరుమల భక్తులు
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే పలువురు భక్తులు దళారుల చేతుల్లో మోసపోతున్నారు. తిరుమలకు నిత్యం 40 వేల నుంచి లక్ష మంది భక్తులు వస్తారు. ఈ రద్దీని అవకాశంగా మలుచుకుంటున్న పలువురు కేటుగాళ్లు సాంకేతికత, పరిచయాల ద్వారా, టీటీడీ ఉద్యోగుల పేరుతో, అనధికార పీఆర్వోలుగా చెలామణి అవుతూ అందినకాడికి దోచుకుంటున్నారు.

ఇదే కోవలో టీటీడీ వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్లు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. వాటిలో టికెట్‌ బుక్‌ చేసుకుంటే నగదు పోయినట్లే. ఇంకొందరు ఘరానా మోసగాళ్లు టీటీడీని సంప్రదించే భక్తుల వివరాలను తెలుసుకొని వారిని ట్రాప్‌ చేస్తున్నారు. తమను తాము టీటీడీ సిబ్బందిగా పరిచయం చేసుకొని దర్శనం చేయిస్తామంటూ డబ్బు వసూలు చేస్తున్నారు.

 
తిరుమల టూటౌన్‌ పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేసిన బోయ పవన్‌కల్యాణ్‌ చేసిన మోసమే అందుకు నిదర్శనం. తాము టీటీడీ ఛైర్మన్‌ పీఆర్వోనని, జేఈవో కార్యాలయంలో పని చేస్తున్నానని, టీటీడీ ఉద్యోగినని సదరు అధికారుల ఫొటోలు తమ వాట్సప్‌ డీపీలుగా పెట్టుకుని నమ్మిస్తున్నారు. దర్శన టికెట్లు ఇప్పిస్తామంటూ మోసగిస్తున్నారు. 
 
తాను టీటీడీ పీఆర్వోనంటూ పలు వాట్సప్‌ గ్రూప్‌లకు మెసేజ్‌లు పంపిన ఓ దళారీ ఉచిత శ్రీవారిసేవ స్లాట్‌ను రూ.800 చొప్పున విక్రయించాడు. ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల పీఆర్వోలుగా చెప్పుకొంటూ కూడా భక్తుల నుంచి నగదు కొట్టేస్తున్నారు. తిరుపతిలోని కొందరు ట్యాక్సీ, ఆటోడ్రైవర్లు, ట్రావెల్స్‌ యజమానులు భక్తులకు నకిలీ టికెట్లు అంటగడుతున్నారు. 
 
విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు ఇప్పించి దోచుకుంటున్నారు. ఇటీవల జీపు, ఆటోల డ్రైవర్లు చంద్రగిరి నుంచి శ్రీవారి మెట్టు వద్దకు తీసుకువెళ్లి ఉచిత దివ్యదర్శనం టోకెన్లు ఇప్పిస్తానని రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. భక్తులు తమ సూచనలు పాటిస్తే దళారుల మోసాల నుంచి రక్షణ పొందడంతోపాటు కేటుగాళ్లను పట్టించే అవకాశం ఉంటుందని విజిలెన్స్‌ వింగ్, తిరుమల పోలీసులు చెబుతున్నారు.
 
* శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాల కోసం ఆన్‌లైన్‌లో టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://ttdevasthanams.ap.gov.in లోనే నమోదు చేసుకోవాలి. తితి దేవస్థానమ్స్‌ యాప్‌ ద్వారా కూడా ఈ సౌకర్యాలు వినియోగించుకోవచ్చు.
* టీటీడీ అధికారుల అధికారిక ఈమెయిల్‌ ఐడీలు టీటీడీ ఈవో: eottd@tirumala.org, eottdtpt@gmail.com టీటీడీ అదనపు ఈవో: jeotml@tirumala.org తిరుపతి జేఈవో: jeotpt@tirumala.org ను సంప్రదించవచ్చు
*వీఐపీ బ్రేక్‌ దర్శనం సిఫార్సు లేఖలను టీటీడీ ఛైర్మన్, పాలకమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, టీటీడీ ఉద్యోగుల వద్ద నేరుగా తీసుకోవడం ద్వారా దళారుల బారిన పడకుండా ఉండొచ్చు.
* శ్రీవారి దర్శనం, వసతి, ఏ ఇతర సందేహాలనైనా నివృత్తి చేసుకునేందుకు టోల్‌ఫ్రీ నంబరు 1800-4254141 లేదా 155257కు ఫోన్‌ చేయవచ్చు.
* తిరుమల వన్‌టౌన్‌ స్టేషన్‌- 94407 96769
* తిరుమల టూటౌన్‌ స్టేషన్‌- 94407 96772