జీవన విలువల గురించి ఆర్ఎస్ఎస్‌లో నేర్చుకున్నాను

జీవన విలువల గురించి ఆర్ఎస్ఎస్‌లో నేర్చుకున్నాను
* ట్రంప్‌కు ‘అమెరికా ఫస్ట్’, నాకు ‘ఇండియా ఫస్ట్’

‘నేను జీవన విధానం, జీవన విలువల గురించి ఆర్ఎస్ఎస్‌లో నేర్చుకున్నాను. పరమార్ధంతో కూడిన జీవితాన్ని పొందాను. ఆర్ఎస్ఎస్ సమావేశాలకు చిన్నపిల్లాడిలా హాజరవడం అంటే నాకెంతో ఇష్టం. దేశానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలని నాకు సంఘ్ నేర్పింది’ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత యూట్యూబర్, ఏఐ శాస్త్రవేత్త లెక్స్ ఫ్రిడ్‌మన్‌తో పాడ్ కాస్ట్‌లో భారత ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు గంటల నిడివి కలిగిన ఈ సుదీర్ఘ పాడ్‌కాస్ట్ వీడియోను ఆదివారం  ఫ్రిడ్‌మన్ విడుదల చేశారు.

“సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌‌) చాలా పెద్ద వ్యవస్థ. ఈ సంవత్సరంతో వందేళ్లు పూర్తి చేసుకోబోతోంది. ప్రపంచంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కన్నా పెద్ద సేవా సంఘం మరొకటి లేదు. సంఘ్‌ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. సంఘ్‌ కార్యకలాపాలను అర్థం చేసుకోవాలంటే కొంత ప్రయాస పడాల్సిందే. జీవితం తాలుకా లక్ష్యాన్ని, ఉద్దేశ్యాన్ని సంఘ్ నేర్పిస్తుంది. దేశమే సర్వస్వం, జనాలకు సేవ చేయడమంటే, దేవుడికి సేవ చేయడమే అని నేర్పిస్తుంది” అని ప్రధాని తెలిపారు. 

“వేదాలు, స్వామి వివేకానందా చెప్పిన మాటలనే సంఘ్‌ సభ్యులు నేర్పిస్తుంటారు. సంఘ్‌లోని కొంత మంది సభ్యులు విద్యలో మార్పుల కోసం విద్యా భారతి అనే సంస్థను నెలకొల్పారు. దేశవ్యాప్తంగా వారు 25 వేల పాఠశాలలను నడుపుతున్నారు. 30 లక్షల మంది విద్యార్థులు వాటిల్లో చదువుతున్నారు. వామపక్షాలకు చెందిన కార్మిక సంఘాలు ప్రపంచంలోని కార్మికులందరూ ఏకం కండి అని నినాదమిస్తే కార్మికులారా ప్రపంచాన్ని ఏకం చేద్దాం అని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన కార్మిక సంఘాలు పిలుపునిస్తాయి” అని వివరించారు.

విమర్శ అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మవంటిదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాను విమర్శలను స్వాగతిస్తానని, అవి మరింత పదునుగా ఉండాలని చెప్పారు.   “నా శక్తి పేరులో లేదు. 140 కోట్ల మంది భారతీయుల మద్దతు, దేశ సంస్కృతి, వారసత్వంలోనే ఉంది. నేను ప్రపంచ నేతలతో చేయి కలిపినప్పుడు, అది మోదీ చేస్తున్నది కాదు. 140 కోట్ల మంది భారతీయులు చేస్తున్నట్లే” అని తెలిపారు. 

“శాంతి గురించి మేం మాట్లాడినప్పుడు, ప్రపంచం మా మాట వింటుంది. ఎందుకంటే గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ జన్మించిన నేల ఇది” అని మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో శాంతి చర్చల కోసం భారత్ గౌరవపూర్వకంగా ప్రయత్నాలు చేసిన ప్రతిసారీ ద్రోహం, విద్వేషమే ప్రతిఫలంగా లభించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఇరుదేశాలు కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలనే గొప్ప సంకల్పంతో 2014లో ప్రధానిగా ప్రమాణం చేసే వేళ నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించానని ఆయన గుర్తు చేసుకున్నారు. కనీసం ఇప్పటికైనా శాంతి మార్గాన్ని పాక్ ఎంచుకుంటుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

బహుశా పాకిస్తాన్ ప్రజలు కూడా శాంతి కోసం ఎదురు చూస్తుండొచ్చు. వాళ్లు కూడా అశాంతితో, ఉగ్రవాద చర్యలతో అలసిపోయి ఉంటారు. ఉగ్రవాదం వల్ల పాక్‌లో అమాయక పిల్లలు చనిపోతున్నారు. ఎంతోమంది ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి” అని మోదీ పేర్కొన్నారు. 

“సార్క్ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన సందర్భంలో అన్ని దేశాలతో పాటు పాక్‌ను కూడా మేం సాదరంగా ఆహ్వానించాం. నాటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చాలా హుందాగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మా ఆహ్వానంతో ఆనాడు సార్క్ సదస్సుకు నవాజ్ షరీఫ్ హాజరయ్యారు. భారత్ విదేశాంగ విధానంలో మేం స్పష్టతను తీసుకొచ్చాం. మునుపెన్నడూ ఇలాంటి ప్రయత్నాలను ఎవరూ చేయలేదు. శాంతి, సౌభ్రాతృత్వాలకే మేం పెద్దపీట వేశాం. అయినా పాక్ వైపు నుంచి ఆశించిన ఫలితం మాకు రాలేదు” అని మోదీ చెప్పారు.

చైనాతో సంబంధాలపై మాట్లాడుతూ, భారత్‌, చైనాలు ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ముందుకెళ్లాలని కోరకుంటున్నామని ప్రధాని మోదీ తెలిపారు. పోటీతత్వం చెడు కాదని, అది ఎన్నడూ సంఘర్షణకు దారి తీయకూడదని అయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ శ్రేయస్సు కోసం ఇరు దేశాల సహకారం ఎంతో అవసరమని మోదీ ఉద్ఘాటించారు.

“రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ అత్యంత అప్రమత్తతతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. గతేడాది ఎన్నికల ప్రచారంలో ఉండగా హత్యాయత్నం జరిగినా, ట్రంప్ ఆత్మస్థైర్యం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆయన అంకితభావం అలాంటిది” అని మోదీ కొనియాడారు.

“ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు నేను ట్రంప్ ప్రభుత్వంలోని టీమ్‌ను కలిశాను. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, అమెరికా నేషనల్ ఇంటెలీజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్, ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలతో భేటీ అయ్యాను. ట్రంప్ విజన్‌ను సాకారం చేయడంలో ఆ టీమ్ విజయవంతం అవుతుందని నేను భావిస్తున్నా” అని భారత ప్రధాని మోదీ చెప్పారు.

“2019 సెప్టెంబరులో హ్యూస్టన్‌లో ఉన్న ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో హౌడీ మోదీ కార్యక్రమం జరిగింది. అందులో నేను ప్రసంగిస్తుంటే, ఆడియన్స్‌లో కూర్చొని ట్రంప్ ఆసక్తిగా విన్నారు. అది ఆయన గొప్పతనం. ఆ క్షణాలు నాకు బాగా గుర్తున్నాయి” అని ఆయన గుర్తు చేసుకున్నారు. 

“ఆడియన్స్‌కు అభివాదం చేసేందుకు ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో తిరుగుదామని నేను చెప్పగానే ట్రంప్ అంగీకరించారు. సెక్యూరిటీని తగ్గించుకొని మరీ నాతో కలిసి నడిచారు. నాపై ఆయనకు అంతటి విశ్వాసం ఉంది. ఇద్దరి బంధం అంత బలంగా ఉంది” అని మోదీ తెలిపారు. “అంతపెద్ద హత్యాయత్నం జరిగిన తర్వాత కూడా అమెరికా కోసమే ట్రంప్ పనిచేస్తున్నారు. ఆయనకు దేశమంటే అంత ప్రేమ. నేను కూడా ఇండియా ఫస్ట్ నినాదాన్ని నమ్ముతాను” అని భారత ప్రధాని చెప్పుకొచ్చారు.

” 2002లో గుజరాత్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో నేను శాసనసభలో కూర్చున్నాను. అదే రోజు గోద్రా ఘటన జరిగింది. అది భయంకరమైన ఘటన. ప్రజలను సజీవ దహనం చేశారు. మీరు ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించండి. 2002కు ముందు గుజరాత్‌లో 250 పెద్ద పెద్ద అల్లర్లు జరిగాయి. 1969లో జరిగిన అల్లర్లు ఏకంగా 6నెలలు వరకూ కొనసాగాయి” అని గుర్తు చేశారు.
 
“అప్పుడు మా ప్రత్యర్థులు అధికారంలో ఉన్నారు. వాళ్లు తప్పుడు ఆరోపణలతో నాపై కేసులు నమోదు చేశారు. కానీ, న్యాయవ్యవస్థ అన్ని ఘటనలపై రెండు, మూడు సార్లు సమగ్ర విచారణ చేసింది. నిందితులను శిక్షించింది. న్యాయవ్యవస్థ తన పని తాను చేసింది. ఇది అందరికీ తెలుసు’ అని మోదీ పేర్కొన్నారు.
“నా బాల్యం మొత్తం పేదరికంలోనే గడిచింది. నా తెల్ల బూట్లను మెరిపించేందుకు పాఠశాలలో వాడి పడేసిన సుద్ద ముక్కలను సేకరించి తెచ్చుకునేవాడిని. ఓ గొప్ప సత్కార్యం కోసం ఉన్నత శక్తి నన్ను ఇక్కడకు పంపించింది. నేను ఒంటరిని కాదు. నన్ను ఇక్కడికి పంపించిన వారే నాకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటారు. మా నాన్న టీ దుకాణానికి వచ్చే వారిని చూసి నేనెంతో నేర్చుకున్నా. వాటినే నా ప్రజా జీవితంలో అమలు చేస్తున్నా’ అని మోదీ అన్నారు.