
గత రెండు నెలలుగా డీఎంకే పార్టీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వితండవాదం చేస్తున్నారని, దక్షిణ భారతదేశానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తోందంటూ, దాన్ని ఎదుర్కొంటామనే విధంగా కేంద్ర ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తామంటూ ప్రకటించడం పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్య, రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్య అని ధ్వజమెత్తారు. జాతీయ విద్యావిధానంతో పాటు, పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన డీలిమిటేషన్ అంశాలపై డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి దివాళాకోరుతనంతో కూడిందని ఆయన మండిపడ్డారు.
వచ్చే ఆరు నెలల్లో తమిళనాడులో జరుగనున్న ఎన్నికల్లో డీఎంకే ఓడిపోనుందని, డీఎంకే పాలన, స్టాలిన్ కుటుంబ అవినీతి, దోపిడీ, నియంతృత్వ ధోరణిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన జోస్యం చెప్పారు. దాన్నుంచి తప్పించుకోవడానికి రాజకీయ నాటకాలు ఆడేందుకు సిద్ధమయ్యారని అంటూ ధ్వజమెత్తారు.
తమిళనాడులో తీవ్రమైన అవినీతి, రాష్ట్ర ప్రభుత్వం విధించిన అధిక పన్నులు, విద్యుత్ ఛార్జీల పెంపు, గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచిందని కిషన్ రెడ్డి విమర్శించారు. మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని, హిందీ భాషను, పార్లమెంటు నియోజకవర్గాలను బూచీగా చూపించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
లిక్కర్ కుంభకోణంలో అనేక మంది డీఎంకే నాయకుల ప్రమేయం ఉందని, కోట్ల రూపాయల ప్రజాధన దోపిడీపై ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. జాతీయ నూతన విద్యావిధానం ఇప్పుడే కొత్తగా ప్రవేశపెట్టలేదని, 1986లో కాంగ్రెస్ హయాంలోనే డీఎంకే మిత్ర ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టిందని గుర్తు చేస్తూ అప్పుడు వ్యతిరేకించలేదని పేర్కొన్నారు.
హిందీయేతర రాష్ట్రాలకు మరింతగా స్థానిక భాషలను ప్రోత్సహించే విధానాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. త్రిభాషా సిద్దాంతం బ్రిటిష్ కాలంలోనే ప్రారంభమైందని చెబుతూ నరేంద్రమోదీ కొత్తగా ప్రవేశపెట్టలేదని, సి. రాజగోపాలాచారి గారి ఆలోచనలతోనే త్రిభాషా సిద్ధాంతం వచ్చిందని స్పష్టం చేశారు.
గతంలో కాంగ్రెస్ హయాంలో కొటారి కమిటీ త్రిభాషా సిద్ధాంతాన్ని మరింత బలపరిచిందని, ఇవన్నీ డీఎంకే నాయకత్వానికి తెలుసని చెప్పారు. కాగా, మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ రాష్ట్రంపైన హిందీ భాషను బలవంతంగా రుద్దలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు కాంగ్రెస్, డీఎంకే పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ అంశంపై రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొంటూ చివరకు డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు ఉదయ్ కుమార్ రూపొందించిన రూపాయి డిజైన్ లోగోను డీఎంకే ప్రభుత్వం మార్చిందని విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయో దీనితో అర్థమవుతుందని చెప్పారు.
15 సంవత్సరాల క్రితం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి లోగో రూపొందించగా, ఇప్పుడు దాన్ని మార్చారని పేర్కొంటూ దీనిని బట్టి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వైఖరి ప్రజలకు అర్థమవుతోందని తెలిపారు. తమిళనాడులో రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన కరెన్సీ చెల్లుబాటు అవుతుందా, కాదా? రాహుల్ గాంధీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
More Stories
వేయి మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 20 వేల బలగాలు
ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష
సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో సంక్షోభంలో పాకిస్తాన్!