
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని `అప్పుల రెడ్డి’గా అభివర్ణిస్తూ రాష్ట్రంలో వైద్య విద్యను బ్రష్టు పట్టించారని అంటూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో వైద్య విద్యపై జగన్ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదంగా ఉందని అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
మోదీ ప్రభుత్వం ఏపీకి 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసి, గ్రాంట్లు, రుణ రూపంలో రూ. 4900 కోట్లిచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే, చేతకాని నాటి సీఎం జగన్ పులివెందులతో సహా, ఒక్క కాలేజీకి కూడా కావలసిన వసతులు పూర్తి చెయ్యలేదని ధ్వజమెత్తారు. ఖర్చు పెట్టాల్సిన మొత్తం రూ. 8,480 కోట్లలో కేవలం 15 శాతం మాత్రమే నాలుగేళ్లలో ఖర్చు చేశారని తెలిపారు.
పైగా, మిగిలిన నిధుల్ని జగన్ దారి మళ్లించారని ఆరోపించారు. దాని కారణంగా రాష్ట్రం 2500 మెడికల్ సీట్లు మూల్యంగా చెల్లించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనే జగన్ కుట్ర అర్థమవుతోందని చెబుతూ 5 మెడికల్ కాలేజీలలో అరకొర మౌలిక వసతులతో, కేవలం పేరు కోసం ఆర్భాటంగా తరగతులు ప్రారంభించారని విమర్శించారు.
చదువు చెప్పడానికి అధ్యాపకులు లేరని, సేవలందించడానికి నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది లేరని, బాలికలు ఉండడానికి వసతి భవనాల్లేవని వివరించారు. పులివెందుల కళాశాలకు ప్రజాధనం రూ.300 కోట్లు ఖర్చు పెట్టిన జగన్, మదనపల్లిలో రూ.500 కోట్లకు గాను రూ.30 కోట్లు కుడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. నర్సీపట్నంకు కేవలం 2 శాతం నిధులు, పాలకొల్లు కాలేజీకి సున్నా నిధులు ఖర్చు పెట్టారని మండిపడ్డారు.
ఇక గిరిజన ప్రాంతంలో పార్వతీపురం కాలేజీ పట్ల చిత్తశుద్ధి లేని గత ప్రభుత్వం టెండర్లు కూడా పిలువలేదని చెప్పారు. నిధులు ఖర్చు పెట్టకుండా, భవనాలు నిర్మించకుండా, బోధనా సిబ్బందికి నోటిఫికేషన్ ఇవ్వకుండా మెడికల్ కాలేజీలెలా ప్రారంభించాలని సత్య కుమార్ ప్రశ్నించారు. ఎలా నాణ్యమైన వైద్యవిద్యను బోధించాలని ఆయన నిలదీశారు.
నాలుగేళ్లలో గుర్రం నాడా మాత్రం తెచ్చి, ఏడాదిలో గుర్రం ఎందుకు తేలేదని తమను ప్రశ్నిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మాజీ సీఎం చేతకానితనం ఇవాళ వైద్యవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శాపంలా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా జీవో 108 తెచ్చి పేదలకు ప్రభుత్వ కళాశాలల్లో రూ.15,000 లకు అందాల్సిన వైద్యవిద్యను రూ. 25 లక్షల దాకా పెంచిన పేదల వ్యతిరేకి పెత్తందారు జగన్ అని వైద్య మంత్రి దుయ్యబట్టారు.
ఏ మెడికల్ కాలేజీ పురోగతి చూసినా ఏమున్నది గర్వకారణం, సమస్త కాలేజీలు పునాదులకే పరిమితమని.. ఇదీ నాలుగేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకమంటూ ఆయన విరుచుకుపడ్డారు. మదనపల్లి, ఆదోని, అమలాపురం, బాపట్ల, పెనుకొండ, పాలకొల్లు వైద్య కళాశాలల పురోగతి చూస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని చెప్పారు. వీటిలో వైద్యవిద్యను ఎలా చెప్పాలో జగన్‌మోహన్ రెడ్డే చెప్పాలని మంత్రి సత్యకుమార్ డిమాండ్ చేశారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
ఏపీ పట్టణాల్లో స్లీపర్‌సెల్స్ పై పోలీసుల డేగకన్ను